Stress : ఈ ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో మనలో చాలా మంది ఒత్తిడి, ఆందోళన వంటి వాటితో బాధపడుతున్నారు. మనం చేసే పని వల్ల మాత్రమే కాకుండా మన జీవన శైలిలో ఉండే కొన్ని చెడు అలవాట్ల కారణంగా కూడా చాలా మంది ఒత్తిడి బారిన పడుతున్నారు. కాలక్రమేణా ఇవి మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ అలవాట్లను మార్చుకోవడం చాలా సులభం. అయినప్పటికి మనలో చాలా మంది వాటిని మార్చుకోరు. కొన్ని సార్లు ఈ చెడు అలవాట్లు మనకు తెలియకుండానే ఒత్తిడికి కారణమవుతాయి. మన ఒత్తిడికి కారణమయ్యే చెడు అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరైన జీవనశైలిని పాటించడం ఈ రోజుల్లో చాలా కష్టం. రోజూ తగినంత వ్యాయామం, శారీరక శ్రమ చేయకపోవడం వల్ల శారీరక ఆరోగ్యం పాడవడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఒత్తిడి పెరుగుతుంది.
కనుక రోజూ వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి దరి చేరకుండా ఉంటుంది. అలాగే ఎండ తగలకుండా ఇంట్లోనే ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. మానసిక స్థితి ప్రభావం అవుతుంది. కనుక రోజూ శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. దీని వల్ల విటమిన్ డి లభించడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే మనం తీసుకునే ఫాస్ట్ ఫుడ్ కూడా మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తరుచూ ఫాస్ట్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. కనుక ఆరోగ్యానికి మేలు చేసే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. అదే విధంగా రోజూ ధ్యానం చేయకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది.
ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సవాళ్లను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. అలాగే మనలో చాలా మందికి పనులను వాయిదా వేసే అలవాటు ఉంటుంది. ఇది కూడా ఒత్తిడిని పెంచుతుంది. పనులను వాయిదా వేయడం వల్ల క్రమంగా ఒత్తిడి పెరుగుతుంది. కనుక ఏ రోజు పనులను ఆరోజు చేసుకునేలా ప్రణాళిక వేసుకోవాలి. పనులను వాయిదా వేయడాన్ని మానుకోవాలి. ఇక నిద్రలేమి కూడా ఒత్తిడిని పెంచుతుంది. కనుక రోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలి. అలాగే వ్యక్తిగతమైన అభిరుచులను, హ్యాబిట్స్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. కనుక సృజనాత్మకతను, కళలను కూడా జీవితంలో భాగం చేసుకుని వాటికి కూడా సమయాన్ని కేటాయించాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఆనందం కలుగుతుంది.
ఇక సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం వల్ల కూడా ఒత్తిడి పెరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక సోషల్ మీడియాను వాడినప్పటికి అది హద్దులు దాటకుండా చూసుకోవాలి. అలాగే నిర్దేశించిన సమయంలోనే పనులను పూర్తి చేసుకోవాలి అని చాలా మంది కొన్ని హద్దులను పెట్టుకుంటారు. దీని వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఈ విధంగా ఈ అలవాట్ల కారణంగా మనలో ఒత్తిడి పెరిగి మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అలాగే ఈ అలవాట్లను మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. చక్కటి జీవనశైలిని ఏర్పరుచుకోవడం వల్ల చాలా సులభంగా మనం ఒత్తిడి నుండి బయటపడవచ్చు.