Metabolism : మన శరీరంలో జీవక్రియ వేగంగా ఉండడం చాలా అవసరం. జీవక్రియలు వేగంగా ఉంటేనే మనం సులభంగా బరువు తగ్గగులుగుతాము. అలాగే మన శరీరంలో క్రియలు అన్నీకూడా సక్రమంగా, వేగంగా జరుగుతాయి. అయితే నేటి తరుణంలో మనలో చాలా మంది తక్కువ జీవక్రియ రేటును కలిగి ఉన్నారు. జీవక్రియ రేటు తక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో క్యాలరీలు నెమ్మదిగా, తక్కువగా ఖర్చు అవుతాయి. శరీరంలో క్రియలన్నీ కూడా నెమ్మదిగా జరుగుతాయి. జీవక్రియ రేటు నెమ్మదించడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పే పదార్థాలను భోజనం చేసిన తరువాత తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. అలాగే ఈ పదార్థాలను భోజనం చేసిన తరువాత తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. శరీర పనితీరు కూడా మెరుగుపడుతుంది.
శరీరంలో జీవక్రియను అలాగే జీర్ణక్రియను పెంచే పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన తరువాత సోంపు గింజలను, జీలకర్రను కలిపి తీసుకోవాలి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రేరేపించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం చక్కగా గ్రహిస్తుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే సోంపును, జీలకర్రను తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. భోజనం చేసిన తరువాత వాము నీటిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. భోజనం తరువాత వాము నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
శరీరంలో జీవక్రియల రేటు కూడా పెరుగుతుంది. అలాగే భోజనం చేసిన తరువాత ప్రోటీన్ మరియు ప్రోబయోటిక్స్ తో నిండి ఉండే పెరుగును తీసుకోవడంమంచిది. ఇది పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో అల్లం,కారం, మిరియాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరంలో ఉష్ణోగ్రతను పెంచడంతో పాటు ఆడ్రినలిన్ ను విడుదల చేస్తాయి. దీంతో శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. అదే విధంగా భోజనం తరువాత ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బెర్రీ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియతో పాటు జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. భోజనం తరువాత ఒక కప్పు గ్రీన్ టీని తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతంగా పని చేస్తుంది. కొవ్వు త్వరగా కరిగిపోతుంది.
అలాగే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కొవ్వులు, పిండిపదార్థాల కంటే ప్రోటీన్ ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ తీసుకోవడం వల్ల జీవక్రియ రేటులో కొద్దిపాటి పెరుగుదల కూడా ఉంటుంది. ప్రోటీన్ తో పాటు మనం తీసుకునే ఆహరంలో ఆకుకూరలు కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ ఆహారాలను భోజనం తరువాత తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరగడంతో పాటు జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది.