Oats Masala Vada : ఓట్స్.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అలాగే వీటితో రకరకాల వంటకాలను తయారు కూడా చేస్తూ ఉంటారు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఓట్స్ తో చేసుకోదగిన వంటకాల్లో మసాలా వడలు కూడా ఒకటి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ వడలను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ ఓట్స్ మసాలా వడలను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ మసాలా వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
2 గంటల పాటు నానబెట్టిన పచ్చిశనగపప్పు – అర కప్పు, ఓట్స్ – ముప్పావు కప్పు, కారం – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, దంచిన ధనియాలు – ఒక టీ స్పూన్, నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – అర కట్ట, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఓట్స్ మసాలా వడ తయారీ విధానం..
ముందుగా జార్ లో నానబెట్టిన శనగపప్పు వేసి నీళ్లు వేయకుండా బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో ఓట్స్, కారం, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, ఉప్పు, ధనియాలు వేసి ముందుగా చేత్తో బాగా కలపాలి. అవసరమైతే తప్ప నీటిని వేయకూడదు. ఈ మిశ్రమం వడ లాగా చేయడానికి రానప్పుడు కొద్దిగా నీటిని వేసి కలపాలి. తరువాత కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుంటూ వడలాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ మసాలా వడ తయారవుతుంది. వీటిని టమాట సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన మసాలా వడలను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.