Sleeping : మనం ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ వేళకు భోజనం చేయడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం ఎంత అవసరమో.. అలాగే వేళకు తగినన్ని గంటలపాటు నిద్రించడం కూడా అంతే అవసరం. అయితే చాలా మంది ప్రస్తుత తరుణంలో సరిగ్గా నిద్రించడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా అనేక కారణాలు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో మానసిక ప్రశాంతత కరువవుతోంది. ఫలితంగా నిద్ర సరిగ్గా పట్టడం లేదు. రాత్రి వేళకు నిద్రిద్దామనుకున్నా ఏవో ఆలోచనలు వస్తుంటాయి. దీంతో రాత్రి 12 లేదా 1 గంటకు నిద్ర పడుతుంది.
అయితే సరిగ్గా నిద్రపోకపోతే చాలా ప్రమాదమని సైంటిస్టులు చెబుతున్నారు. సరిగ్గా నిద్రించని వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా నిద్ర సరిగ్గా లేనివారికి గుండె జబ్బులు త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు అంటున్నారు. ఈ మేరకు వారు అధ్యయనాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే వారు వివరాలను వెల్లడించారు.
అమెరికాకు చెందిన కార్డియోవాస్కులర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూయార్క్ పరిశోధకులు ఇటీవల ఓ అధ్యయనం చేపట్టారు. కొందరు వ్యక్తులను రోజూ 7 నుంచి 8 గంటల పాటు నిద్రించమని చెప్పారు. కొన్ని వారాల తరువాత వారి రక్తనమూనాలను సేకరించి పరిశీలించారు. వారిలో రోగ నిరోధక వ్యవస్థ కణాలు అత్యంత ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. తరువాత వారిని రోజూ ఒక గంటన్నర సమయం తక్కువగా నిద్రించమని చెప్పారు. తరువాత కొన్ని వారాలకు మళ్లీ వారి రక్త నమూనాలను సేకరించారు.
చివరకు వాటిని విశ్లేషించగా తేలిందేమిటంటే.. నిద్ర తగ్గే కొద్దీ ఆరోగ్యవంతమైన ఇమ్యూనిటీ కణాలు తగ్గుతున్నట్లు గుర్తించారు. అంటే మనం రోజూ సరిగ్గా నిద్రిస్తే ఆరోగ్యవంతమైన కణాలు పెరుగుతాయన్నమాట. అదే నిద్ర తక్కువగా ఉంటే ఇమ్యూనిటీ సెల్స్ ఆరోగ్యంగా ఉండవు. క్షీణిస్తాయి. దీంతో వ్యాధులు వస్తాయి. చివరకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక రోజూ కనీసం 6 నుంచి 8 గంటల పాటు అయినా సరే నిద్రించాలని సైంటిస్టులు చెబుతున్నారు. లేదంటే వ్యాధుల పాలు కావల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే.