Viparita Karani : నిత్యం చాలా మందికి బిజీ లైఫ్ అయిపోయింది. సరిగ్గా భోజనం చేసేందుకు కూడా సమయం లభించడం లేదు. నిద్ర కూడా తక్కువవుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే వ్యాయామం ఎందుకు చేస్తారు చెప్పండి. వ్యాయామం చేయడం లేదేంటి.. అని అడిగితే అందుకు చాలా మంది చెప్పే సమాధానం.. సమయం లేదనడమే. అయితే ఇప్పుడు మీకు చెప్పబోయే ఒక ఆసనాన్ని గనక మీరు రోజుకు కేవలం 5 నిమిషాల పాటు వేస్తే చాలు.. దాంతో బోలెడు ప్రయోజనాలు పొందవచ్చు. ఇక ఆ ఆసనం ఏమిటో, దాన్ని ఎలా వేయాలో, దాంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు చెప్పబోయే ఆసనం పేరు.. విపరీత కరణి ఆసనం. దీన్నే వాస్తవంగా చెప్పాలంటే యోగాలో ఒక ముద్రగా భావిస్తారు. ఇందులో భాగంగా మీరు మీ కాళ్లను ఏదైనా గోడకు సపోర్ట్‌గా పైకి ఉంచాలి. చిత్రంలో చూపినట్లుగా నేలపై పడుకుని కాళ్లను గోడ పైకి పెట్టాలి. ఇప్పుడు నడుము గోడకు దగ్గరగా ఆనుకుని ఉండాలి. తరువాత చేతులను శరీరానికి ఇరు వైపులా నేలపై పెట్టాలి. ఈ భంగిమలో కనీసం 5 నిమిషాల పాటు అయినా ఉండాలి.
పొట్ట కరిగిపోతుంది..
ప్రారంభంలో చాలా మందికి కష్టంగానే ఉంటుంది. కానీ రోజూ ఈ ఆసనం వేస్తే కొన్ని రోజుల్లోనే మీరు ఈ ఆసనాన్ని సులభంగా వేయగలుగుతారు. ఇక ఈ ఆసనాన్ని వేయడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆసనం వేస్తే పొట్ట దగ్గరి కండరాలు బలంగా మారుతాయి. ఆ ప్రాంతంపై ఒత్తిడి పడుతుంది. దీంతో అక్కడి కొవ్వు సులభంగా కరిగిపోతుంది. అధిక పొట్ట ఉన్నవారు ఈ ఆసనం వేస్తే పొట్టను కరిగించుకోవచ్చు. అలాగే దీని వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగు పడుతుంది.
గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం ఉన్నవారు రోజూ ఈ ఆసనాన్ని 5 నిమిషాల పాటు వేసినా చాలు.. ఎంతో ఫలితం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. ముఖ్యంగా రక్తం గుండె వైపు ప్రయాణిస్తుంది. దీంతో రక్త శుద్ధి జరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మెదడుకు ఆక్సిజన్ సరషరా పెరుగుతుంది. రక్తం కూడా అందుతుంది. దీని వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఫలితంగా రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది.
ఉత్సాహంగా మారుతారు..
ఈ ఆసనం వేయడం వల్ల కాళ్లలో, పాదాల్లోనూ రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో కాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా రోజూ గంటల తరబడి కూర్చుని లేదా నిలుచుని ఉండేవారికి ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. అలాగే ఈ ఆసనాన్ని వేస్తే తీవ్రమైన అలసట సైతం తగ్గుతుంది. దీంతో ఉత్సాహంగా మారుతారు. నీరసం తగ్గుతుంది. రోజూ యాక్టివ్‌గా పనిచేస్తారు. అలసట, బద్దకం అనేవి ఉండవు. కనుక ఈ ఆసనాన్ని రోజూ 5 నిమిషాల పాటు వేసి అనేక లాభాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.