కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మోదీ సర్కార్ కొత్త రూల్స్ జారీ చేసింది.ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణకు కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. కేంద్ర పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ విభాగం కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం… 20 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన కేంద్ర ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే, ముందస్తు నోటీస్ ఇచ్చి ఉద్యోగం నుంచి వైదొలగొచ్చు. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ 11 అక్టోబర్ 2024న ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. ఈ కొత్త రూల్ ప్రకారం 20 ఏళ్ల సర్వీస్ పీరియడ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం వారిని నియమించిన అధికార యంత్రాంగానికి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.
కేంద్ర ఉద్యోగి అభ్యర్థనను అధికారం తిరస్కరించకపోతే, నోటీసు వ్యవధి ముగిసిన వెంటనే పదవీ విరమణ అమలులోకి వస్తుంది. కొత్త రూల్ ప్రకారం, ఒక కేంద్ర ఉద్యోగి మూడు నెలల నోటీసు ఇచ్చి పదవీ విరమణ చేయాలనుకుంటే, అతను తప్పనిసరిగా రాతపూర్వకంగా అభ్యర్థించాలి. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నియామక యంత్రాంగానికి నోటీస్ పిరియడ్‌ను తగ్గించే అధికారం కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ కోసం నోటీసు ఇచ్చిన తర్వాత, సంబంధిత అధికార యంత్రాంగం ఆమోదం లేకుండా దానిని వెనక్కు తీసుకోలేడు. ఒకవేళ, వాలంటరీ రిటైర్మెంట్‌ను క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే, పదవీ విరమణ చేసే తేదీకి కనీసం 15 రోజుల ముందు క్యాన్సిలేషన్ కోసం దరఖాస్తు చేయాలి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఆఫీస్ మెమోరాండం ప్రకారం, సర్వీస్ నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందే ప్రభుత్వ ఉద్యోగులకు పీఎఫ్ఆర్డీఏ రెగ్యులేషన్స్ 2015″ ప్రకారం అన్ని ప్రయోజనాలు అందుతాయి. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో పొందే అన్ని సౌకర్యాలను ప్రామాణిక పదవీ విరమణ వయస్సులో వాలంటరీ రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా దక్కించుకుంటారు. డీఓపీ అండ్ పీడబ్ల్యూ గైడ్‌లైన్స్ ప్రకారం.. ఒక ఉద్యోగి ‘మిగులు ఉద్యోగి’ కావడం వల్ల ‘ప్రత్యేక స్వచ్ఛంద పదవీ విరమణ పథకం’ కింద రిటైర్మెంట్ తీసుకుంటే, అతనికి ఈ రూల్ వర్తించదు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత అతనిని మరేదైనా ప్రభుత్వ రంగ సంస్థ లేదా స్వయం ప్రతిపత్త సంస్థలో ఉద్యోగిగా అతన్ని నియమిస్తే, అలాంటి వారికి కూడా ఈ నియమం వర్తించదు.