ప్రధాన మంత్రి అన్ని రంగాల వారికి లాభం చేకూరేలా అనేక పథకాలు ప్రవేశపెడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రధాని నరేంద్ర మోదీ. ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ ఏబీ పీఎంజేఏవై పథకానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద పేద, ధనిక అనే తేడా లేకుండా 70 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌ను కల్పించే అవకాశః ఉంటుంది. ఈ పథకం కింద, ఆయుష్మాన్ కార్డు పొందిన వారు అక్టోబర్ 29 నుండి ఏదైనా ఎంపిక చేసిన ఆసుపత్రులలో రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు.
ఈ ఏబీ పీఎంజేఏవై ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 4.5 కోట్ల కుటుంబాల్లోని 6 కోట్లమంది 70 ఏళ్లు దాటిన వృద్ధులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఆధార్ కార్డుపై ఉన్న వయసు ఆధారంగా ఈ పథకానికి అర్హులను ఎంపిక చేస్తామని అన్నారు. కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ ఈ పథకం కింద రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ లభించనుంది.ఇప్పటికే ఆయుష్మాన్భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు.. ఉన్నదాని కంటే అదనంగా మరో రూ.5 లక్షల కవరేజీ లభిస్తుంది. ఇక ఒకే కుటుంబంలో 70 ఏళ్లు దాటిన వారు ఇద్దరు ఉంటే వారికి చెరి సగం ప్రయోజనం చేకూరుతుంది. అంటే చెరో రూ.2.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
పుట్టుక నుండి 17 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు ఇచ్చిన టీకాల శాశ్వత డిజిటల్ రికార్డులను భద్రపరిచే యూ – విన్ పోర్టల్ ను కూడా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. యూ విన్ పోర్టల్ కోవిడ్ -19 వ్యాక్సిన్ నిర్వహణ కోసం రూపొందించిన కో – విన్ పోర్టల్ తరహాలో ఇది ఉంటుంది. హెల్త్ కేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను పెంచడం తమ ప్రాధాన్య అంశమని ప్రధాని మోదీ తెలియజేశారు. ఈ పథకం కోసం పిఎంజెఎవై పోర్టల్ లో లేదా ఆయుష్మాన్ యాప్ లో నమోదు చేసుకోవాలి. ఇప్పటికే ఆయుష్మాన్ కార్డు ఉన్నవారు పోర్టల్ లేదా యాప్ లో మళ్లీ దరఖాస్తు చేసుకుని కొత్త కార్డు కోసం ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ కార్డు అప్లై చేసుకునేందుకు కావాల్సిన పత్రాల్లో ఆధార్ కార్డు ఒక్కటే సరిపోతుందని ఇటీవల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం వెల్లడించింది.