మనం ఏదైనా దైవ దర్శనాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కొలనులో స్నానాలు ఆచరించి దైవ దర్శనానికి వెళ్తాం. ఈ విధంగా పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొందరు నదికి పూజలు చేస్తుంటారు. మరికొందరు నదిలో దీపాలను వదలడం, కొబ్బరికాయను కొట్టి నదిలోకి వదలడం వంటివి చేస్తుంటారు. మరికొన్ని చోట్ల భక్తులు నదిలోకి లేదా కొలనులోకి కాయిన్స్ వేయడం మనం చూస్తుంటాము. అయితే అందరూ వేస్తున్నారు కాబట్టి మనం వేస్తాం. కానీ ఆ విధంగా కాయిన్స్ ఎందుకు వేస్తారో చాలామందికి తెలియదు.
పూర్వకాలం నుంచే ఈ విధంగా నదిలో నాణేలు వేయడం ఒక ఆచారంగా ఉండేది. అయితే అప్పుడు రాగి నాణేలు ఎక్కువగా వాడుకలో ఉండటం వల్ల ప్రజలు రాగి నాణేలను నీటిలో వేసేవారు. రాగికి నీటిని శుభ్రపరిచే గుణం ఉంది కనుక నదిలోకి రాగి నాణాలు వేయటం వల్ల నీరు శుభ్రం అవుతుంది. ఆ శుభ్రమైన నీరు తాగడానికి ఎంతో ఉపయోగపడుతుందని భావించి కొలనులో వేసేవారు.
అప్పటి నుంచి ఇదే ఆచారం కొనసాగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం రాగి బదులుగా మనం వాడుకలో ఉన్న కాయిన్స్ వేయటం వల్ల అవి నీటిలో తుప్పుపట్టి నీరు కలుషితం అవుతోంది. ఇప్పుడు వాడుతున్న ఈ కాయిన్స్ ను నీటిలో వేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు.