బట్టతల సమస్య అనేది చాలా మందికి ఉంటుంది. కొందరికి యుక్త వయస్సులోనే బట్టతల వస్తుంటుంది. ఇక కొందరికి ఎంత వయస్సు ముదిరినా జుట్టు నల్లగానే ఉంటుంది, కానీ కొంచెం బట్టతల కూడా రాదు. ఈ క్రమంలోనే బట్టతల వచ్చినవాళ్లు విచారిస్తుంటారు. డబ్బులు ఉంటే హెయిర్ ట్రీట్‌మెంట్ చేయించుకోవడం, ఇతర మార్గాలను అనుసరించడం చేస్తుంటారు.
అయితే చాలా మందికి బట్టతల విషయంలో ఒక అపోహ ఉంటుంది. అదేమిటంటే.. టోపీ పెట్టుకోవడం వల్ల బట్టతల వస్తుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. టోపీ పెట్టుకోవడం వల్ల బట్టతల రాదట. వంశపారంపర్యంగానే బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
ఇక అధిక ఒత్తిడి, పోషకాల లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడం.. వంటి పలు ఇతర కారణాల వల్ల కూడా బట్టతల వచ్చేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అంతేకానీ.. టోపీ పెట్టుకోవడం వల్ల బట్టతల రాదని చెబుతున్నారు.
అయితే కొందరికి జుట్టులో చెమట పడితే దురద వస్తుంది. అలాగే చుండ్రు కూడా ఏర్పడుతుంది. కనుక అలాంటి వారు టోపీ ధరించకపోవడమే మంచిది. ఇక ఇతరులు ఎవరైనా సరే నిరభ్యంతరంగా టోపీని పెట్టుకోవచ్చు. దాంతో బట్టతల వస్తుందని భయపడాల్సిన పనిలేదు.