వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగును. బాహ్య ప్రపంచ జ్ఞానము కలుగును. విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును. విభూతి (భస్మం) ధరించినప్పుడు ఓం నమః శివాయా అను మంత్రమును జపించుచు ధరించవలెను. విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు. విభూతిధారణ దేవతాపూజ, జపము, యజ్ణ్జము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును. తప్పక ధరించవలెను. విభూతి భస్మం, తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించ కూడదు. భస్మము ఐదు విధముల పేర్లతో ఉన్నట్లు తెలియచున్నది.
భస్మం, విభూతి, భసితము, క్షారము, రక్షయని పిలుస్తారు. 1. విభూతి కపిలవర్ణము, 2. భసితము కృష్ణ వర్ణము, 3. భస్మము శ్వేత వర్ణము, 4. క్షారము ఆకాశవర్ణము, 5. రక్ష రక్తవర్ణము కలిగి యుండును. బ్రహ్మాది దేవతలు నారదాది మహర్షులు సనక సనందనాది యోగులు బాణాసురాది దానవులు శివునిపై గల భక్తి భావములతో నిత్యం భస్మ స్నానమోనర్చి పాప విముక్తి పొందిరి. ఓం నమః శివాయ అను మంత్రముతో భస్మమును అభిమంత్రించి ఒడలిపై ధారణ చేయవలెను. త్రిపుండ్రములను ధరించవలెను. శిరమున, నుదుటన, కర్ణమున, కంఠమునందు, భుజములందు ఈ విధముగా పదునైదు తావులందు త్రిపుండ్రధారణ చేయవలెను. కుడిచేతి నడిమి మూడు వేళ్ళతో ఎడమ నుండి కుడివైపునకు, బొటన వేలుతో కుడినుండి ఎడమవైపునకు త్రిపుండ్రములను దాల్చ వలెను. శివపూజ సాధకులెల్లరును తప్పక ఈ విధముగా భస్మధారణ చేయవలెను.
నిత్యము ఈ విధముగా ధరించడంవలన సమస్త పాపములు నశించును. గంగా, యమున, సరస్వతి సంగమ స్నానము వలన కలుగు ఫలితములు ఈ భస్మస్నానము వలన కలుగును. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలు ఈ భస్మ స్నానము వలననే గొప్పవారైరి. త్రిపుండరేఖలలో త్రిమూర్తులు ఉన్నారు. మొదటి రేఖ బ్రహ్మ, రెండవ రేఖ విష్ణువు, మూడవ రేఖ శివుడు. కావున మూడు రేఖలను లలాటమున ధరించుట శ్రేష్టము. ఎల్లప్పుడూ కుడి చెయ్యి మధ్య మూడు వేళ్ళతో భస్మధారణ చేయవలెను. భస్మ స్నానము కంటే పవిత్ర స్నానము లేదని చెప్పుచూ శివుడు మొదట భస్మ ధారణచేసి సమస్త దేవతలకు ప్రసాదించెను. అనాటి నుండి బ్రహ్మాది సర్వ దేవతలు భస్మధారణ మహా ప్రసాదముగా స్వీకరించారు. చంద్రశేఖరుడైన శివునకు భస్మము అర్పించిన చాలా సంతసించును. యాగములు, దానములు, తపస్సు మొదలైన వానికంటే శివునకు భస్మధారన అధిక సంతృప్తినిచ్చును. ఒకసారి మహేశ్వరుని భస్మంతో తృప్తిపరిచిన సర్వాభీష్టములు నెరవేరును.