సాధారణంగా ఇంట్లో నిర్వహించే సత్యనారాయణస్వామి వ్రతం, వాస్తుపూజ, వాస్తు సంబంధిత అంశాల్లో తరుచుగా వాడే పదాలు అష్టదిక్పాలకులు. చాలా మంది దిక్కులు అంటే నాలుగు ఉన్నాయని అనుకుంటారు. కానీ దిక్కులు మొత్తం 8. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంతోపాటు ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం అని మరో 4 మూలలు ఉంటాయి. మొత్తం దిక్కులు అంటే 8 అనే చెప్పాలి. ఇక ఈ దిక్కులకు ఒక్కో దేవత అధిపతిగా ఉంటారు. కనుకనే వారిని దిక్పాలకులు అని పిలుస్తారు.
తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిపతి. ఆగ్నేయం వైపునకు అగ్ని, దక్షిణానికి యముడు అధిపతి. నైరుతికి నైరుతి అధిపతి. పశ్చిమానికి వరుణుడు, వాయువ్య దిశకు వాయువు, ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి. ఈశాన్య దిశకు ఈశాన్యుడు అధిపతిగా ఉన్నారు.
వాస్తు శాస్త్రంలో కచ్చితంగా 8 దిక్కులలో నియమాలను పాటిస్తారు. ఏయే దిక్కుల్లో వేటిని ఉంచాలి, వేటిని ఉంచకూడదు వంటి విషయాలను చెప్పారు. ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు, ఆ భాగంలో కిటికీ ఉండాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు రావాలి. ఆగ్నేయం వైపున మనీ ప్లాంట్ వంటివి పెట్టుకోవాలి. నైరుతి దిశలో బరువులు పెట్టవచ్చు. ఆ దిశలో లేదా వాయువ్య దిశలో బాత్‌రూమ్‌లు ఉండాలి. ఉత్తరం దిక్కున తల పెట్టకూడదు. దక్షిణం వైపు తల పెట్టి నిద్రించాలి. ఇలా వాస్తు ప్రకారం అనేక నియమాలను పాటిస్తారు.