మెడకింద కొవ్వు చేరితే మరింత లావుగా కనపడతారు. కిందికి వంగినా, నవ్వు నవ్వినా అసహ్యంగా వుంటుంది. బరువు పెరగటం లేదా చర్మంలో పటుత్వం కోల్పోవటం గడ్డం కింద కొవ్వు రావటానికి నిదర్శనం. ఆకర్షణీయమైన మెడకు దిగువ వ్యాయామాలు చేయండి. తిన్నగా నిలబడండి. తల కొద్దిగా పైకెత్తి సీలింగ్ చూడండి. పెదాలను సాగదీస్తూ గాలిలోకి పైకి ముద్దాడండి. అయిదు నుండి పది సెకండ్లు. అయిదు సార్లు చేయండి. ముఖం లోని ఇతర కండరాలను బిగపట్టకండి.
మెడను అటునుండి ఇటుకు ఇటునుండి అటుకు ఛాతీ పైభాగాన్ని టచ్ చేస్తూ తిప్పండి. దీనిని నించుని లేదా కూర్చుని కూడా చేయవచ్చు. మెడను పూర్తిగా కూడా రొటేట్ చేయవచ్చు. పూర్తిగా కష్టమైతే సగం సర్కిల్ మాత్రమే చేయండి. ప్రతి భుజం వైపు మెల్లగా అయిదు లేదా ఆరు సార్లు చేయండి. వజ్రాసనంలో కూర్చోండి. కుడిచేయి తలపై పెట్టండి తలను కుడి భుజంవైపు సాగేటంతవరకు వంచండి. అయిదు వరకు లెక్కించి రిలాక్స్ అవండి. దీనిని ఎడమవైపు కూడా చేయండి. ప్రతి సైడు ఎనిమిది నుండి 10 సార్లు చేయండి.
కూర్చుని లేదా నించుని సీలింగ్ వైపుగా చూస్తూ ఉఫ్ మంటూ గాలి వదలండి. పెదాలను లోపలికి బిగపడుతూ కూడా చేయవచ్చు. దీనిని 10 నుండి 15 సార్లు చేయండి. చేతులు లేని ఛైర్ పై కూర్చోండి. తలను మెల్లగా వెనక్కు తీసుకు వెళ్ళండి. నోరు మూయటం తెరవగలిగినంత తెరవటం చేయండి. గడ్డాన్ని పైకి ఎత్తండి ఏదో నములుతూ వున్నట్లుగా నమలండి. దవడలు బాగా కదలాలి. అతి సామాన్యమైన ఈ గడ్డం వ్యాయామాలు ప్రతిరోజూ చేసి మీ గడ్డం కింద మెడ భాగాన వున్న కొవ్వును కరిగించేయండి. ఆకర్షణీయమైన మెడను సొంతం చేసుకోండి.