ప్రపంచంలో ఏ దేశంలోనైనా టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్… ఇలా ఎన్ని చక్రాలు ఉన్న మోటార్ వాహనాన్నయినా, ఎవరైనా కొనుగోలు చేస్తే దాన్ని కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. వాహనానికి ముందు, వెనుకాల ఆ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నంబర్‌ను ప్లేట్‌పై స్థానిక ఆర్‌టీఏ నిబంధనల ప్రకారం రాసుకోవాల్సిందే. ఇది ఎక్కడైనా జరుగుతుంది. అయితే నంబర్ ప్లేట్లపై కొందరు తమ వాహనాల నంబర్లను ఫ్యాన్సీ, 3డీ ఆర్ట్ రూపంలో రాయించుకుంటారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. అంతేకాకుండా, నంబర్ ప్లేట్లపై నంబర్లు కాకుండా కొందరు వివిధ రకాల టెక్ట్స్‌ను, బొమ్మలను వేయించుకుంటారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమే. అయితే వీటి సంగతి పక్కన పెడితే, నంబర్ ప్లేట్ల గురించే ఇప్పుడు మనం చర్చించుకోవాలి. ఎందుకంటే, మీరెప్పుడైనా నలుపు, పసుపు, నీలం, ఎరుపు వంటి వివిధ రంగుల్లో ఉన్న నంబర్ ప్లేట్లను చూశారా..? చూసే ఉంటారు, కానీ వాటి గురించి అంతగా ఆలోచించి ఉండరు. అయితే అవి ఆయా రంగుల్లో ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్ల నంబర్ ప్లేట్లు… మన దేశంలో అధిక శాతం నంబర్ ప్లేట్లు ఈ విభాగం కిందికే వస్తాయి. వ్యక్తిగత వాహనాలు ఈ నంబర్ ప్లేట్లను కలిగి ఉంటాయి. వాటిపై నలుపు రంగులో నంబర్లు ఉంటాయి. దేశంలో ఉన్న ప్రతి వాహనం ఈ నంబర్ ప్లేట్‌నే సాధారణంగా కలిగి ఉంటుంది. పసుపు రంగు నంబర్ ప్లేట్లు… ఆటోలు, టాక్సీలు, ట్రక్కులు, లారీలు పసుపు రంగు నంబర్ ప్లేట్లను కలిగి ఉంటాయి. వాటిపై నలుపు రంగులో నంబర్లు ఉంటాయి. బాణం గుర్తు నంబర్ ప్లేట్లు… తెలుపు రంగులో నంబర్లను కలిగి ఉండి, వాటి మధ్యలో 1, 3వ నంబర్ల స్థానంలో పైకి సూచిస్తున్న బాణం గుర్తు ఉంటే అవి మిలటరీ వాహనాలు. వీటిని కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తుంది. ఆ శాఖ పేరిటే ఈ వాహనాలు రిజిస్టర్ అయ్యి ఉంటాయి.
నలుపు రంగు నంబర్ ప్లేట్లు… వాహనాల నంబర్ ప్లేట్లు నలుపు రంగులో ఉండి, వాటిపై పసుపు రంగులో నంబర్లు రాసి ఉంటే అవి సెల్ఫ్ డ్రైవ్ విభాగం కిందకి వస్తాయి. వాణిజ్య పరంగా ఈ వాహనాలను వినియోగిస్తారు. ఎవరైనా కారును సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటామంటే వారికి ఇలాంటి వాహనాలను అద్దెకు ఇస్తారు. నీలి రంగు నంబర్ ప్లేట్లు… తెలుపు రంగులో నంబర్లను కలిగి ఉండి, నీలి రంగులో నంబర్ ప్లేట్లు ఉంటే అవి ఫారిన్ మిషన్ వాహనాల కిందకి వస్తాయి. వీటికి నంబర్లు సాధారణంగా యూఎన్ (యునైటెడ్ నేషన్స్), సీసీ (కాన్సులర్ కార్ప్స్), సీడీ (డిప్లొమాట్ కార్ప్స్) అనే సిరీస్‌తో నంబర్లు ప్రారంభమవుతాయి.
ఎరుపు రంగు నంబర్ ప్లేట్లు… కార్ల వంటి వాహనాలను అమ్మే షోరూం నిర్వాహకులు ఎరుపు రంగు నంబర్ ప్లేట్లను కలిగి ఉన్న కార్లను తమ షోరూంలలో పెడతారు. వీటిని టెస్ట్ డ్రైవ్‌ల కోసం, కార్ ప్రమోషన్ కోసం ఉపయోగిస్తారు. అలాగే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీం కోర్టు లేదా హైకోర్టు జడ్జిలు ఎరుపు రంగు నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తారు.