Covid Vaccine : దేశంలో ఒమిక్రాన్ కరోనా వేరియెంట్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ డిసెంబర్ 25వ తేదీన పలు కీలక ప్రకటనలు చేసిన విషయం విదితమే. జనవరి 1 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మరింత పకడ్బందీగా నిర్వహించడంతోపాటు విద్యార్థులకు కోవిడ్ టీకాలను వేయనున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి జనవరి 3వ తేదీ నుంచి టీకాలను వేస్తారు.
అయితే 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు విద్యార్థులు అయితే తమ స్టూడెంట్ ఐడీ కార్డులను ఉపయోగించి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు స్లాట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ మేరకు కోవిన్ ప్లాట్ ఫామ్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార్, ఇతర ఐడీ కార్డులు లేని 15 నుంచి 18 ఏళ్ల బాల బాలికలు తమ స్టూడెంట్ ఐడీ కార్డుతో కోవిడ్ వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకు గాను 10వ ఐడీ కార్డు కింద స్టూడెంట్ ఐడీ కార్డును ఆప్షన్‌లలో చేర్చినట్లు తెలిపారు.
ఇక బాల బాలికలు జనవరి 1వ తేదీ నుంచే కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే జనవరి 3వ తేదీ నుంచి వారికి టీకాలను ఇస్తారు. ఇక జనవరి 10వ తేదీ నుంచి హెల్త్ అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రికాషనరీ డోస్ కింద బూస్టర్ డోస్‌ను ఇస్తారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కూడా బూస్టర్ డోస్‌ను ఇవ్వనున్నారు.
అయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు బూస్టర్ డోస్‌ను తీసుకోవాలంటే.. అందుకు తమ డాక్టర్ సలహా తీసుకోవాలి. అలాగే వ్యాధులు ఉన్నట్లు సంబంధిత ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుంది. దీంతో వారు బూస్టర్ డోస్ తీసుకోవచ్చు.