నిత్యం మనం ఎన్నో విషయాలను గమనిస్తుంటాం. ఎన్నో వస్తువులను వాడుతుంటాం. అలాంటి వాటిలో ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే వీటిపై ఉండే అక్షరాలు, చిహ్నాలను మీరు ఎప్పుడైనా గమనించారా..? అదేనండీ చాలా వరకు కార్డులపై VISA, MASTER CARD, RuPay CARD అని ఉంటుంది కదా. అవును అవే. అయితే వాటి గురించి మీకు తెలుసా..? మనం వాడే ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డులపై వీటిలో ఏదో ఒకటి కచ్చితంగా ఉంటుంది. మరి వాటితో ఉపయోగం ఏమిటి..? అవెందుకు ఉంటాయి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
VISA, MASTER CARD, RuPay CARD వీటిని పేమెంట్ గేట్ వేస్ అంటారు. అంటే.. మనం ఏటీఎం/డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును వాడినప్పుడు పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) స్వైపింగ్ మెషిన్‌లో కార్డును స్వైప్ చేస్తాం కదా. ఇక ఇంటర్నెట్‌లోనూ మనం పేమెంట్ చేసేందుకు ఆయా కార్డులను వాడుతుంటాం. అయితే మనం చెల్లించే డబ్బును తీసుకునే వ్యాపారికి మన బ్యాంక్‌కు చెందిన శాఖలోనే అకౌంట్ ఉండదు కదా. అతనికి వేరే బ్యాంక్‌లో అకౌంట్ ఉండవచ్చు. మరి అలాంటప్పుడు అతని అకౌంట్‌లోకి డబ్బును పంపడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ ఇబ్బందిని అధిగమించడం కోసమే VISA, MASTER CARD, RuPay CARD పేమెంట్ గేట్‌వేలను అందుబాటులోకి తెచ్చారు. ఇవి ఏం చేస్తాయంటే…
మనం ఆన్‌లైన్‌లో లేదా స్వైపింగ్ మెషిన్ లో కార్డును స్వైప్ చేసినప్పుడు మన ఖాతాలోని డబ్బు ముందుగా పైన చెప్పిన VISA, MASTER CARD, RuPay CARD పేమెంట్ గేట్‌వేకు చేరుతుంది. అక్కడి నుంచి డబ్బు వ్యాపారి ఖాతాకు వెళ్తుంది. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరుగుతుంది. దీంతో పేమెంట్ పూర్తయి స్లిప్ బయటికి వస్తుంది. ఇలా మనం కార్డులతో కొంటాం. అయితే ఇలా వ్యాపారి అకౌంట్‌కు వినియోగదారుడి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఆయా పేమెంట్ గేట్‌వేలు కొంత చార్జిని వసూలు చేస్తాయి. కానీ వినియోగదారుడిది, వ్యాపారిది ఒకే బ్యాంక్ అయినప్పుడు ఆ చార్జి తగ్గుతుంది. అలాంటప్పుడు వ్యాపారి పేమెంట్ గేట్‌వేకు చెల్లించే చార్జి తగ్గి అతనికి లాభం కలుగుతుంది.
అయితే మరి ఒకే పేమెంట్ గేట్ వేను వాడవచ్చు కదా, ఇన్ని గేట్ వేలు ఎందుకు..? అంటే.. ఒక్కో కంపెనీ ఒక్కో చార్జిని వసూలు చేస్తుంది. వ్యాపారులు తమ ఇష్టానికి అనుగుణంగా ఆ చార్జిలను చూసుకుని ఆయా గేట్‌వేలను ఎంచుకుంటారు. అందుకే ఒకటి కన్నా ఎక్కువ కంపెనీలు గేట్ వేలను అందిస్తున్నాయి. అయితే నిజానికి VISA, MASTER CARD అనేవి విదేశీ కంపెనీలు. దీంతో చాలా వరకు లావాదేవీల్లో ఇవి చార్జిలను పొందుతున్నాయి. లక్షల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మన దేశ డబ్బు విదేశీ కంపెనీలకు చేరుతోంది. దీంతో కేంద్రం RuPay CARD పేమెంట్ గేట్‌ను లాంచ్ చేసింది. ఇది పూర్తిగా భారతీయ పేమెంట్ గేట్‌వే. ప్రస్తుతం ఈ గేట్‌వే పేరిట చాలా వరకు బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అయితే రూపే కార్డ్ పేమెంట్ గేట్ వే కేవలం మన దేశంలో మాత్రమే పనిచేస్తుంది. కానీ వీసా, మాస్టర్ కార్డ్ గేట్ వేలు విదేశీ సైట్లలో కూడా పనిచేస్తాయి. ఇదీ… పేమెంట్ గేట్ వేల గురించిన అసలు విషయం..!