మహాభారతం.. దీని గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఎన్నో వేల శ్లోకాలతో, పర్వాలతో ఉంటుందిది. అనేక కథలు ఇందులో ఉన్నాయి. అయితే చాలా మందికి మహాభారతంలో ఉన్న కథలేమిటో తెలుసు. కానీ కొన్ని కథల గురించి మాత్రం కొందరికి ఇప్పటికీ తెలియదు. అంటే.. వాటి గురించి ఎక్కడా చెప్పబడలేదు. కనుకనే తెలియదు. ఈ క్రమంలోనే అలాంటి కొన్ని కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నమ్మకం..
ఒక సారి కర్ణుడు, దుర్యోధనుడి భార్య భానుమతి ఆమె మందిరంలో పాచికలు ఆడుతూ ఉంటారు. చాలా సేపటి నుంచి ఆట సాగుతూ ఉంటుంది. అయితే ఇక ఆట ముగింపు దశకు వస్తుంది. భానుమతి కచ్చితంగా ఓడిపోయే స్థితికి వస్తుంది. అదే సమయంలో ఆ మందిరంలోకి భానుమతి భర్త దుర్యోధనుడు వస్తాడు. అతని రాకను ఆమె గమనిస్తుంది. ఎందుకంటే ఆమె ద్వారానికి ఎదురుగా ఉంటుంది. కర్ణుడి వీపు ద్వారం వైపుకు ఉంటుంది. అయితే భర్త వచ్చాడని భానుమతి మర్యాదగా పైకి లేవడానికి యత్నిస్తుంది. దీంతో అది గమనించిన కర్ణుడు ఆమె ఓడిపోతుంది కనుక పారిపోయేందు యత్నిస్తుందని అర్థం చేసుకుంటాడు. వెంటనే ఆమె ముఖంపై ఉన్న వస్త్రాన్ని పట్టుకుని ఆపేస్తాడు. దీంతో ఆ వస్త్రానికి అలంకారమై ఉన్న ముత్యాలు తాడులోంచి తెగి కింద పడుతాయి. ఈ హఠాత్ పరిణామానికి భానుమతి షాక్ అవుతుంది. ఆమె ముఖాన్ని గమనించిన కర్ణుడు వెనక్కి తిరిగి చూడగా దుర్యోధనుడు కనిపిస్తాడు. దీంతో వారిద్దరికీ ఏం చేయాలో తెలియక ముఖాలు కిందకు దించుకుంటారు. అయితే దుర్యోధనుడు మాత్రం తాపీగా వచ్చి ముత్యాలు ఏరాలా..? లేదంటే ఏరి దండ గుచ్చాలా..? అని అడుగుతాడు.
తప్పని లెక్క..
ఇక మహాభారతంలో ఉన్న మనకు తెలియని మరో కథ ఏమిటంటే… కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరుగుతుంది కదా. అందుకు గాను యుద్ధం కోసం పాండవులు, కౌరవులకు పలు రాజులు మద్దతునిస్తారు. కానీ ఉడుపి అనే రాజ్యానికి చెందిన రాజు మాత్రం ఎవరికీ మద్దతు ఇవ్వడు. తటస్థంగా ఉంటాడు. అయితే యుద్ధం జరుగుతున్న ప్రాంతం అతని రాజ్యానికి దగ్గరే కావడంతో పాండవులు, కౌరవ సేనలకు రోజూ ఆహారం వండిపెట్టేందుకు ఆ రాజు అంగీకరిస్తాడు. ఈ క్రమంలో అతను తన సైనికుల ద్వారా ఇరు పక్షాల సేనలకు రోజూ ఆహారం పంపేవాడు. అయితే రోజూ ఆహారం మిగిలేది కాదు, సరిగ్గా అందరికీ సరిపోయేది. రోజూ యుద్ధంలో మరణించే సైనికుల సంఖ్య తగ్గినప్పటికీ ఆహారం మాత్రం ఏ రోజు కారోజు అందరికీ సరిపోయినంతే వచ్చేది. ఇందుకు కారణం ఎవరికీ తెలిసేది కాదు. అంత కచ్చితంగా ఆ రాజు ఆహారం ఎలా పంపేవాడో చాలా మందికి తెలియదు. అయితే అందుకు కారణం ఏమిటంటే… ఉడుపి రాజ్య రాజు రోజూ రాత్రి శ్రీకృష్ణుడి గుడారానికి వెళ్లేవాడు. ఆ సమయంలో కృష్ణుడు ఉడకబెట్టిన వేరుశెనగలు తినేవాడు. అయితే వాటికి ఉడుపి రాజు పొట్టి తీసి కృష్ణుడికి గింజలు ఇచ్చేవాడు. ఈ క్రమంలో కృష్ణుడు వేరు శెనగ కాయలు తిని వెళ్లిపోగానే ఆ రాజు కృష్ణుడు ఎన్ని గింజలు తిన్నాడో వాటి పొట్టును లెక్కపెట్టేవాడు. ఉదాహరణకు 10 వేరుశెనగ కాయలు తింటే మరుసటి రోజు 10,000 మంది చనిపోతాడని తెలుసుకుని 10వేల మందికి తక్కువగా వండేవాడు. దీంతో ఏ రోజు వండిన ఆహారం ఆ రోజు అందరికీ సరిపోయేది.
లోక కళ్యాణం..
మహాభారతంలో ఉన్న మరో ఆసక్తికరమైన కథ ఏమిటంటే… భీష్ముడి తండ్రి శంతనుడు మొదట గంగా దేవిని వివాహం చేసుకుంటాడు. అయితే గంగ వివాహానికి ముందు శంతనుడికి ఓ షరతు విధిస్తుంది. తనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ ప్రశ్నలు అడగరాదని అంటుంది. అందుకు శంతనుడు ఒప్పుకుంటాడు. తరువాత వారి వివాహం జరుగుతుంది. ఈ క్రమంలో ఆమెకు 7 మంది కుమారులు జన్మిస్తారు. అయితే కుమారుడు పుట్టినప్పుడల్లా గంగ తమ కుమారున్ని తీసుకుని వెళ్లి నీటిలోకి విసిరేసి వస్తుంది. అయితే శంతనుడు అది చూసి కూడా ప్రశ్నించలేకపోతాడు. ఎందుకంటే ముందే గంగ షరతు విధించింది కదా. అలా ఆమె 7 మందిని నదిలో విసిరేశాక 8వ కుమారున్ని కూడా అలాగే విసరడానికి వెళ్తుంది. దీంతో శంతనుడు ఏదైతే అది అవుతుందని భావించి ఎందుకలా పుట్టిన వారిని పుట్టినట్టు విసిరేస్తున్నావు, అని గంగను అడుగుతాడు. ఇందుకు ఆమె స్పందిస్తూ, నువ్వు మాట తప్పావు రాజా, నన్ను ప్రశ్నలు అడగవద్దని చెప్పా కదా, అయినా నువ్వు అడిగావు, కనుక నీ వద్ద ఇక నేను ఉండను, వెళ్లిపోతా. అయితే నేను ఎందుకు ఇలా సంతానాన్ని నీటిలోకి వేశానో అందుకు కారణం మాత్రం చెబుతా. 8 మంది వసువులకు వశిష్ట మహర్షి శాపం పెట్టాడు, మనుషులుగా పుట్టమని, అందుకని వారు అడిగితే వారికి తల్లిగా వచ్చా. వారికి జన్మినిచ్చా. అందులో భాగంగానే వారిని నదిలో వేశా. ఇక వారికి శాప విముక్తి అయిపోయింది. ఇందుకు నీకు చాలా పుణ్యం దక్కింది. అయితే 8వ కుమారున్ని మాత్రం నేను నదిలో వేయను. నా దగ్గరే పెంచుతా. యుక్త వయస్సుకు వచ్చాక నీకు అప్పగిస్తా, అని గంగ అంతర్థానమవుతుంది. తరువాత ఆ కుమారుడికి యుక్త వయస్సు రాగానే శంతనుడికి అప్పగిస్తుంది. అతనే భీష్ముడు..!