శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రత్యేకం.. ముత్తైదువులు, మహిళలకు పండగరోజు. అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీ కటాక్షం పొందాలంటే శుక్రవారం రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి.. పసుపు , ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి.. ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సుమంగళి ప్రాప్తిస్తుంది. అనుకున్న కార్యాలు పూర్తవడంతో పాటు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. జీవితం శుభకరంగా, మంగళకరంగా, సంతోషంగా సాగాలంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి.
శుక్రవారం అమ్మవారికి తెల్లపువ్వులు సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే కుటుంబమంతా సుఖసంతోషాలతో, ప్రశాంతతతో ఉంటుందని నమ్మకం. శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరస్సులో ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించాలి. చీరలు, లంగా ఓణీలు వేసుకుంటే.. సంప్రదాయత ఉట్టిపడుతుంది. నుదుట కుంకుమ రంగు బొట్టు పెట్టుకోవాలి. ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద, విభూదిని నుదుటి బొట్టుపైన పెట్టుకోవాలి. ఆలయంలో కర్పూరం వెలింగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో, ఇతరుల అగ్గిపెట్టెలు తీసుకునో దీపం వెలిగించడం మంచిది కాదు. ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా.. ఇతరులకు చేకూరుతుంది.
శుక్రవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తే.. గరిక మాల తీసుకెళ్లండి. గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి, సర్వ శుభాలు చేకూరుతాయి. ఇదే విధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే తులసీ మాల సమర్పించాలి. ఆంజనేయస్వామిని దర్శించుకునే వాళ్లు వెన్నముద్దతో వెళ్లడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దుర్గమ్మను శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఈతిబాధలు తొలగిపోయి సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.