హిందూ సంప్రదాయంలో బొట్టు లేదా తిలకం పెట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిటి మధ్య కుంకుమ ధరిస్తారు. అది భర్త క్షేమాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది. నుదుటిన బ్రహ్మ దేవుడు కొలువై ఉంటాడు. జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తికి నుదుటి భాగం స్థానం. అందుకే రెండు కనుబొమ్మల నడుమ బొట్టు పెట్టుకుంటారు. నుదుటిన బొట్టు సంప్రదాయంగా మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. గౌరవానికి సూచికగా బొట్టు నిలుస్తుంది. అందుకే ఏదైనా శుభకార్యాలకు పిలవడానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు. కుంకుమ, సింధూరం, గంధం, భస్మం ఇలా రకరకాల వాటిని బొట్టుగా పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నాడులు ఉత్తేజితం అవుతాయి. తలనొప్పి తగ్గుతుంది.
చాలా మంది బొట్టు పెట్టుకోవడానికి ఉంగరం వేలు పవిత్రమైనదిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి, ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు. దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలుని మాత్రమే ఉపయోగించాలి. ఈ వేలు స్థానం సూర్యుడిది కావడం వల్ల ఆయన శక్తి మనలోకి వస్తుందని విశ్వసిస్తారు. చిటికెన వేలితో బొట్టు పెట్టుకోకూడదని హిందూ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. భూతాలు, తంత్ర క్రియలు చేసేటువంటి కార్యక్రమాల్లో మాత్రమే ఈ వేలితో బొట్టు పెట్టుకుంటారు. మధ్య వేలితో కూడా బొట్టు పెట్టుకోవచ్చు. శని మధ్య వేలు మూలంలో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. మధ్యవేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్హు పెరుగుతుంది. సంపద పెరుగుతుంది. చూపుడు వేలిని మృతదేహంపై బొట్టు పెట్టడం కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఈ వేలితో బొట్టు పెట్టడం వల్ల మోక్షం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. చనిపోయిన వారికి తప్ప మరొకరికి చూపుడు వేలితో బొట్టు పెట్టకూడదు.
బొటన వేలు శుక్రుడి స్థానాన్ని సూచిస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహంగా పేర్కొంటారు. అందుకే బొటన వేలితో తిలకం పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. బొట్టు అనగానే ఎరుపు రంగుదే పెట్టుకుంటారు. పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు బొట్టు అసలు పెట్టుకోకూడదు. నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మ దేవుడి రంగు ఎరుపు. నుదుటిని బ్రహ్మ స్థానం అంటారు. అందుకే ఆయనకి ఇష్టమైన ఎరుపు రంగు బొట్టు ధరిస్తారు. వైధవ్యం పొందిన వాళ్ళు మాత్రం ఎరుపు రంగు బొట్టు పెట్టుకోరు. విభూదిని పెట్టుకుంటారు. మహిళలతో పాటు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్య కిరణాలు పడి శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి. బొట్టు లేని మొహం మీద చూసేందుకు కూడా బాగోదు.