ఆయుర్వేదంలో త్రికటు చూర్ణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మూడు మూలికల మిశ్రమం ఇది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. నల్ల మిరియాలు, పిప్పళ్లు, అల్లం.. మూడింటిని కలిపి త్రికటు చూర్ణం తయారు చేస్తారు. మార్కెట్‌లో త్రికటు చూర్ణం లభిస్తుంది. కానీ ఈ చూర్ణాన్ని ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఎండిన అల్లం పొడి 10 గ్రాములు, నల్ల మిరియాల పొడి 10 గ్రాములు, పిప్పళ్ల చూర్ణం 10 గ్రాములు తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని త్రికటు చూర్ణం అంటారు. దీన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. అలాగే బెల్లం, నెయ్యిలను కూడా అర టీస్పూన్ చొప్పున తీసుకోవాలి. వీటిని అన్నింటినీ కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. భోజనం చేసిన అనంతరం ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి.
ఇలా 15 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఎంతటి దగ్గు అయినా సరే తగ్గిపోతుంది. ఇతర శ్వాస కోశ సమస్యలు కూడా తగ్గుతాయి.
త్రికటు చూర్ణంతో బెల్లం, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల అనేక విధాలుగా మేలు జరుగుతుంది. శ్వాస కోశ సమస్యలకు ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది.
అయితే గ్యాస్, అసిడిటీ, డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకోరాదు. మిగిలిన ఎవరైనా ఈ మిశ్రమాన్ని తీసుకోవచ్చు.
త్రికటు చూర్ణాన్ని సీసాలో నిల్వ చేసుకుంటే 3-6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే దాన్ని బెల్లం, నెయ్యిలతో కలిపి నిల్వ చేస్తే 2 వారాల వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఒకే సారి నిల్వ చేసి రోజూ పైన చెప్పినట్లుగా తీసుకోవచ్చు. దీని వల్ల దగ్గు తగ్గడంతోపాటు శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.