జియో అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ముకేష్ అంబానీ.. అలాగే ఆయన పేరు చెప్పినా మనకు జియో కంపెనీయే ముందుగా గుర్తుకు వస్తుంది. అంతగా జియో టెలికాం నెట్‌వర్క్ జనాలకు దగ్గరైంది. అయితే నిజానికి జియో రావడం వెనుక కారణం ఎవరో తెలుసా..? ముకేష్ అంబానీ పిల్లలే. ఆయన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలే జియో రావడం వెనుక ఉన్న శక్తులు. అంతేకాదు, ప్రస్తుతం జియోను నడిపిస్తున్నది కూడా వారే. ఏంటీ నమ్మశక్యంగా లేదా..? అయినా ఇది నిజమే. ఇదే విషయాన్ని సాక్షాత్తూ ముకేష్ అంబానీయే వెల్లడించారు.
ఒకసారి ముకేష్ కూతురు ఈషా అంబానీ ముంబైలో ఇంటికి కాలేజీ సెలవుల నిమిత్తం వచ్చిందట. ఆమెకు ప్రాజెక్టు వర్క్ ఉండడంతో ఇంటర్నెట్‌లో నిమగ్నమైంది. అయితే నెట్ పరంగా ఆమెకు ఇబ్బందులు ఎదురు కావడంతో మనమే సొంతంగా ఇంటర్నెట్ అందించే కంపెనీ ఎందుకు పెట్టకూడదని తన తండ్రికి సలహా ఇచ్చిందట. దీనికి ఆకాష్ కూడా మద్దతు తెలపడంతో అప్పుడు జియో ప్రారంభమైంది. అలా జియో టెలికాం నెట్‌వర్క్‌కు పునాది పడింది. ఇక ముకేష్ అంబానీ తన తమ్ముడు అనిల్ అంబానీతో ఆస్తులను పంచుకున్నప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనిల్‌కు వెళ్లింది. దీంతో టెలికాం కంపెనీ పెట్టకూడదని అనిల్ తన అన్న ముకేష్ వద్ద మాట తీసుకున్నాడు. కానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ సరిగ్గా నడవకపోవడం, ప్రత్యర్థి కంపెనీలైన ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ తదితర సంస్థలు మొబైల్ డేటా, కాల్స్ పేరిట కస్టమర్లను దోచుకుంటుండడంతో ఇక లాభం లేదనుకుని తన కొడుకు ఆకాష్, కుమార్తె ఈషా అంబానీలు ఇచ్చిన సలహా మేరకు ముకేష్ అంబానీ జియోను ప్రారంభించారు. అలా జియో ఆవిర్భావం అయింది. తరువాత అది ఏవిధంగా అంచెలంచెలుగా ఎదిగిందో అందరికీ తెలిసిందే.
ఇక జియో 4జీ ఫీచర్ ఫోన్ ను లాంచ్ చేయమని చెప్పింది కూడా ఆకాష్, ఈషా అంబానీలే. వారి సూచన మేరకే జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేశారు. అందుకే ఆ ఫోన్ లాంచింగ్ కార్యక్రమంలో స్వయంగా వారే ఆ ఫోన్ ఫీచర్లను వివరించారు. ఇక జియో టెలికాం కంపెనీతోపాటు రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లోనూ ఆకాష్, ఈషాలు ఇద్దరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జియో కంపెనీకి చెందిన ముఖ్యమైన వ్యవహారాలను ఆకాష్ చూసుకుంటే, ఆ కంపెనీ మార్కెటింగ్, ఇతర వ్యవహారాలను ఈషా చూసుకుంటుందట. కానీ ఇద్దరిలో ఈషాయే చదువుల్లో టాపర్ అట. ఆకాష్ యావరేజ్ స్టూడెంట్ అట. అలా అని చెప్పి ఎక్కడా ఫెయిల్ మాత్రం కాలేదు. ఉన్నత చదువులే చదివాడు.
కేవలం జియో టెలికాం కంపెనీలోనే మొత్తం లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ముకేష్ అంబానీ వెల్లడించారు. అంత మంది భవిష్యత్తును తన కుమారుడు, కుమార్తె చేతుల్లో పెట్టి జియోను దిగ్విజయంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఆకాష్ విషయానికి వస్తే అతను మీడియాకు దూరంగా ఉంటాడట. కానీ విలాసవంతమైన సదుపాయాలు అంటే బాగా ఇష్టమట. ఖరీదైన కార్లు, వాచ్‌లు, దుస్తులు వాడుతాడు. కానీ పెద్దలు అంటే బాగా గౌరవం ఇస్తాడట. ఇక అతను చదువు అయ్యాక తన తండ్రి దగ్గరే.. అంటే ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీలోనే ఇంటర్న్‌షిప్ చేశాడట. తరువాత తన తల్లి నీతా అంబానీతో కలిసి ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీం ఓనర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో జియో ప్రారంభించాక దాని డైరెక్టర్‌గా కూడా కొనసాగుతున్నాడు.
ఈషా అంబానీ విషయానికి వస్తే ఈమె చదువుల్లో టాపర్. ఆకాష్ కన్నా బాగా తెలివితేటలు కలది. ఈమెకు రిలయన్స్ కంపెనీలో భారీగా షేర్లు ఉన్నట్లు తెలిసింది. దీంతో అత్యంత చిన్న వయస్సులోనే ఈమె సంపన్నుల జాబితాలో చేరింది. ఇక చివరిగా ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ విషయానికి వస్తే.. ఇతన తన బరువు తగ్గడంతో వార్తల్లోకి ఎక్కాడు. ఒకప్పుడు అధిక బరువున్న ఇతను 18 నెలల కాలంలోనే ఏకంగా 108 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్య పరిచాడు. అయితే ప్రస్తుతం అనంత్ ఖాళీగానే ఉంటున్నాడు. త్వరలోనే ఇతను కూడా రిలయన్స్‌లో ఏదైనా కొత్త కంపెనీ ప్రారంభిస్తానని చెబుతున్నాడు. ఈ విషయం వేచి చూస్తే తెలుస్తుంది..!