ఊబర్, ఓలా వల్ల ఆటోవాళ్ళకి నష్టం వాటిల్లుతోందని వాళ్ళు వాపోతుంటే, చాలామంది ఆటోవాళ్ళే వాటిని ఎందుకు వాడుతున్నారన్నది ప్రశ్న. ఇదిగో దీని వెనుక కథ: నష్టమంటే ఏమిటంటే, ఊబర్, ఓలా వాళ్ళు ఆటో ఛార్జీలో దాదాపు 40% కమీషన్ కింద లాగేసుకుంటున్నారన్నది ఆటోవాళ్ళ బాధ. ఆటో వాళ్ళ దృష్టిలో ఇది అన్యాయం. ఎందుకంటే, ఆటో వాళ్ళదే, పెట్రోల్ ఖర్చు వాళ్ళదే, ట్రాఫిక్‌లో ఆటో నడిపే కష్టం వాళ్ళదే. అలాంటిది, కేవలం బాడుగలు చూపించినందుకు ఇంత కమీషన్ ఎందుకు ఇవ్వాలి? అన్నది వారి ప్రశ్న. సింపుల్‌గా చెప్పాలంటే, ఊబర్, ఓలా వాళ్ళు వారి శ్రమను దోచుకుంటున్నారని వారి ఫీలింగ్. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. ఊబర్, ఓలా లాంటి వేదికల్ని జనం ఎందుకు ఆదరిస్తున్నారో ఆటోవాళ్ళు ఆలోచించరు. చాలామందికి ఈ ఆటో వాళ్ళ ప్రవర్తన నచ్చదు.
కాస్త వివరంగా చెప్పాలంటే, దురుసుగా మాట్లాడటం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి రాకపోవడం, షార్ట్ కట్ వదిలిపెట్టి ఊరంతా తిప్పి తీసుకెళ్ళడం, మీటర్ టాంపరింగ్ చేసి ఎక్కువ డబ్బు గుంజడం, మీటర్ కంటే ఎక్కువ డబ్బు అడగడం, భాష, లింగ వివక్ష చూపించడం… ఇలాంటివి చాలామంది ఆటోవాళ్ళు చేస్తుంటారు. ఇదిగో, నాకూ ఇలాంటి చేదు అనుభవాలు చాలా ఉన్నాయి! ఇక్కడే ఊబర్, ఓలా ఎంటర్ అవుతాయి. ఈ వేదికలు ఆటోవాళ్ళ ఆగడాలను కట్టడి చేస్తాయి. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించకూడదు. ప్రయాణికులకు నచ్చేలా ప్రవర్తిస్తేనే మళ్ళీ వాళ్ళకి బాడుగలు వస్తాయి. లేదంటే, కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. కంప్లైంట్ చేస్తే ఊబర్, ఓలా వాళ్ళు సీరియస్‌గా తీసుకుంటారన్న భయం ఆటోవాళ్ళకి ఉంటుంది.
అందుకే, ఊబర్, ఓలా తొందరగానే జనాల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. ఎందుకంటే, వాళ్ళకి ప్రయాణికుల మనస్తత్వం తెలుసు. వాళ్ళకి సౌకర్యంగా ఉంటేనే మళ్ళీ వస్తారు. ఇదిగో ఈ లాజిక్ ఆటోవాళ్ళకి అర్థం కాదు. రోడ్డు మీద ఆటో కోసం ఎదురుచూసే కంటే, యాప్ ద్వారా బుక్ చేసుకోవడమే చాలామందికి ఈజీగా ఉంది. ఇక ఆటోవాళ్ళ విషయానికి వస్తే, ఊబర్, ఓలా వాళ్ళ వల్ల ఖాళీగా ఉండకుండా ఎక్కువసేపు ఆటో తిప్పి ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు. ప్రయాణికులు కూడా ఎక్కువగా ఈ వేదికల్లోనే ఉంటారు. అందుకే, ఆటోవాళ్ళకి ఇది తప్పనిసరి అయిపోయింది. కాకపోతే, ఆటోవాళ్ళకి ఒక బాధ ఉంది. అదేంటంటే, ఈ వేదికలు తమని బాగా వాడుకుంటున్నాయని వాళ్ళు ఫీలవుతారు. కానీ, దీనికి కారణం వాళ్ళ ప్రవర్తనే అని వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు, రాపిడో లాంటి కొత్త వేదికలు వచ్చాయి. ఇవి ఆటోవాళ్ళ దగ్గర ఫిక్స్‌డ్ ఫీజు తీసుకుని మిగతా డబ్బు వాళ్ళకి ఇస్తాయి. చూడాలి, ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో!