కన్నడ నటి రన్యారావును బంగారం అక్రమ రవాణా కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెల్లిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మార్చి 3న అరెస్టు చేసిన విషయం విదితమే. దుబాయ్ లో కొన్న 14.2 కిలోల బంగారాన్ని ఆమె స్మగ్లింగ్ చేసి ఇండియాకు తీసుకొచ్చిందన్న కారణంతో ఆమెను వారు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆమె కర్ణాటకకు చెందిన సీనియర్ ఐపీఎస్ డీజీపీ స్థాయి అధికారి కుమార్తె. దీంతో ఆమె అరెస్టు సంచలనంగా మారింది. అయితే రన్యారావు అంత పెద్ద మొత్తంలో బంగారాన్ని ఇండియాకు ఎలా తీసుకువచ్చిందని అధికారులు వివరాలను వెల్లడించారు.
రన్యారావు 14.2 కిలోల బంగారాన్ని తెచ్చిందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. కొన్ని బంగారు బార్స్‌ను తొడలకు స్ట్రిప్స్ ద్వారా కట్టుకుందని, కొన్నింటిని బెల్ట్‌లో పెట్టుకుందని, ఇంకా కొన్ని బార్స్‌ను జాకెట్ లోపల దాచిందని తెలిపారు. కాగా రన్యారావు గత 6 నెలల్లో ఏకంగా 27 సార్లు దుబాయ్‌కు వెళ్లి వచ్చింది. ఇంత తక్కువ కాలంలో అన్ని సార్లు దుబాయ్‌కు వెళ్లి రావడం, వెళ్లినప్పుడల్లా 5 నుంచి 10 రోజులు అక్కడ ఉండి రావడం, ఆమె వేషధారణ, బరువు.. ఇవన్నీ చూసి అనుమానం వచ్చిన అధికారులు ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేయగా అసలు విషయం బయట పడింది.
ఇక ఈ కేసులో ఇప్పటికే ఆమెకు స్పెషల్ కోర్టు మార్చి 18వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ కోసం ఆదేశాలు జారీ చేయగా.. ఆమెను కస్టడీలోకి తీసుకునేందుకు డీఆర్ఐ అధికారులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. అయితే రన్యారావు ఎయిర్ పోర్టుల్లో వీఐపీ గేట్ల ద్వారా వెళ్లడం, రావడం చేసేది. అందువల్లే ఆమె చెకింగ్‌లను తప్పించుకుంటూ వచ్చింది. కానీ ఆమె వ్యవహారంపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా అసలు విషయం బయట పడింది.