గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) పోలీసులకు ఒక వింత అనుభవం ఎదురైంది. వారు తాజాగా స్టేషన్ నుంచి బయల్దేరబోతున్న ఓ ట్రెయిన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ బోగీలో వింత శబ్దాలు రావడం మొదలైంది. దీంతో వారు ఆ బోగీలోకి వెళ్లారు. అయితే శబ్దాలు రైలు బోగీలోని టాయిలెట్ నుంచి వస్తున్నట్లు గమనించి టాయిలెట్ వద్దకు వెళ్లారు. అందులో నుంచి శబ్దాలు వస్తుండడాన్ని గమనించిన వారు ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో టాయిలెట్ డోర్‌ను తెరిచేందుకు యత్నించారు.
అయితే టాయిలెట్ డోర్ ఎంతకూ తెరుచుకోలేదు. లోపలి నుంచి గడియ పెట్టి ఉందన్న విషయాన్ని గమనించిన పోలీసులు ఆ టాయిలెట్ డోర్‌ను పగలగొట్టి తెరిచారు. దీంతో టాయిలెట్‌లో ఉన్న వారిని చూసి ఖంగు తిన్నారు. అందులో ఇద్దరు పిల్లలు ఉండడం వారిని విస్మయానికి గురి చేసింది. వారు అందులో నుంచి బయటకు వచ్చేందుకు లోపలి నుంచి డోర్‌ను కొడుతున్నట్లు పోలీసులకు అర్థమైంది. అయితే ఆ పిల్లలకు చెందిన వివరాలను తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు.
ఎవరో ఆ ఇద్దరు పిల్లలను ఆ ట్రెయిన్ లో అలా వదిలేసి వెళ్లారట. అదే విషయాన్ని ఆ పిల్లలు పోలీసులకు చెప్పారు. అయితే కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు ఆ పిల్లలను వెంటనే జిల్లా శిశు సంరక్షణ శాఖ అధికారులకు అప్పగించారు. అయితే అక్కడ ఇదేమీ కొత్త కాదని, పిల్లలు ఇలాగే చాలా సార్లు లభ్యమయ్యారని పోలీసులు తెలిపారు. ఈశాన్య రైల్వే పరిధిలో ఇప్పటి వరకు ఇలాంటి పిల్లలు మొత్తం 644 మందిని చేరదీసి శిశు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా ట్రెయిన్‌లో అలా వారు శబ్దం చేసే సరికి పోలీసులు మాత్రం ఖంగు తిన్నారనే చెప్పవచ్చు.