పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి జరుగుతాయన్న విషయం తెలిసిందే. దేశంలోని అన్ని నదులకు పుష్కరాలు వస్తుంటాయి. ఈ క్రమంలో మనం ఏటా ఏదో ఒక నదికి చెందిన పుష్కర ఉత్సవాలను గమనించవచ్చు. ఇక ప్రస్తుతం సరస్వతి నదీ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. దీంతో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే సరస్వతి నది ఎక్కడ ప్రవహిస్తుంది, పుష్కర స్నానం చేయాలంటే ఎక్కడికి వెళ్లాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రినాథ్ అనే ప్రాంతానికి సమీపంలో ఉన్న చవోలి అనే జిల్లాలో సరస్వతి నది రూపాంతరం చెందింది. ఈ నది ఇక్కడే పుట్టిందని చెబుతారు. దీన్నే భారతావని చిట్టచివరి గ్రామం అని కూడా పిలుస్తారు. ఇక్కడికి సమీపంలో ఉన్న మానా అనే గ్రామంలో సరస్వతి నదిలో పుష్కర స్నానం చేయవచ్చు.
పంచ సరోవరాల్లో ఒకటైన పుష్కర సరోవరం రాజస్థాన్‌లో ఉంది. ఇక్కడి ఆరావళి పర్వతాల నడుమ అజ్మీర్ అనే జిల్లాలో పుష్కర్ ఉంది. ఇక్కడ బ్రహ్మ దేవాలయం కూడా ఉంది. పుష్కర స్నానం ఆచరించవచ్చు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ సమీపాన గంగా యమునా సరస్వతిల కలయిక త్రివేణి సంగమం (కుంభమేళా క్షేత్రం) ఉంది. అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో సిద్ధపూర్ క్షేత్రాన కర్దమ ప్రజాపతి ఋషి మహిమ వల్ల మాతృదయ అనే పేర్లతో పిలువబడుతున్న సరస్వతీనదిగా పిలువబడే బిందుసరోవరంలో స్నానం చేయవచ్చు.
తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రాన గుప్తకామినిగా సరస్వతీనది ప్రసిద్ధి చెందింది. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల త్రివేణి సంగమం వద్ద పావన పుష్కర స్నానం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో తిరుమల క్షేత్రానగల శ్రీవారి క్షేత్రం వద్ద పుష్కరిణిలో స్నానం చేయవచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో సరస్వతి నది లేకున్నప్పటికీ ఆ క్షేత్రాన్ని పుష్కర క్షేత్రంగా భావించి పుష్కర స్నానం ఆచరించవచ్చు. సరస్వతి దేవి ఆలయం లేదా బ్రహ్మ ఆలయం ఉన్న ప్రాంతాల్లోని నదుల వద్ద కూడా పుష్కర స్నానం చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు.