మనం నిద్రిస్తున్న సమయంలో కలలు రావడం అనేది సర్వసాధారణం. అలా నిద్రిస్తున్న సమయంలో పదేపదే చనిపోయిన వారు కలలో కనిపిస్తున్నారా? ఇలా కనిపిస్తే మరణించిన వారు ఆత్మ రూపంలో మన చుట్టూ తిరుగుతున్నారనే భయం మనలో కలగడం సాధారణం. అసలు చనిపోయిన వారు కలలో కనిపించడానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఇలా కలలో కనిపిస్తున్నానని విషయానికి వస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తున్నారు అంటే వారి ఆత్మ ఈ లోకంలో సంచరిస్తుందని అంటున్నారు.
ఈ విధంగా చనిపోయిన వారి ఆత్మలు మనలో కలలో కనిపించినప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు అని చెబుతున్నారు. కలలో కనిపించిన వారి పేరు మీద రామాయణం, లేదా భగవద్గీత పఠించడం ప్రారంభించాలి. ఒకవేళ వారు ఎంతో బాధతో, ఏమీ మాట్లాడకుండా మీ కలలో కనిపిస్తే మీరు ఏదో తప్పు చేయబోతున్నారని సంకేతం. ఒకవేళ వారు మీ కలలో ఆకలితో కనిపిస్తే వెంటనే పేదలకు సహాయం చేయడం, లేదా పిల్లలకు స్వీట్లు పంచడం వంటివి చేయండి. చనిపోయిన వ్యక్తి మీ కలలో కనిపించి ఏదైనా పని చేయమని అడిగితే వారు చెప్పిన పని పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయండి.
వారి పేరు మీద దానధర్మాలు చేయడం మంచిది. ఒకవేళ చనిపోయిన మీ కుటుంబ సభ్యుడే కలలో కనిపిస్తే అది చాలా శుభప్రదం అని మరవకండి. అదేవిధంగా చనిపోయిన వ్యక్తులు ఒకవేళ కోపంతో కనుక మీకు కనబడితే వాళ్ళు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం. అందుకే కలలో పూర్వీకులు కనపడితే వారు చెప్పిన విధంగా చేయడం మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. చాలామంది తీరని కోరికలతో మరణించి ఉంటారు. కావున కలలో వారు మనకు ఏదైనా చేయమని సలహా ఇస్తే తప్పకుండా చేయడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది ఈ లోకం వదిలి వెళుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.