హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని చెట్లను దైవ సమానంగా భావిస్తారు. ఇలా దైవ సమానంగా భావించే మొక్కలను పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని భావిస్తారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు ప్రత్యేక పర్వదినాలలో లేదా ప్రత్యేక మాసాలలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు. హిందూ ధర్మం ప్రకారం అత్యంత పవిత్రమైన చెట్లు ఏవి, వాటిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
జమ్మి చెట్టును హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ క్రమంలోనే జమ్మిచెట్టుకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే శని గ్రహదోషం ఉన్నవారు శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శనిగ్రహ దోషం తొలగిపోతుంది.
మర్రి చెట్టును కూడా ఎంతో పవిత్రమైన వృక్షంగా భావిస్తారు. మర్రి చెట్టుకు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల పితృదేవతల ఆత్మ సంతృప్తి చెందుతుందని భావిస్తారు. అలాగే మర్రి చెట్లలో సకల దేవతలు కొలువై ఉండటం వల్ల మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. మరికొందరు మర్రిచెట్టుతోపాటు వేపచెట్టుకు కూడా పూజలు నిర్వహిస్తారు.
ప్రతి ఇంటి ఆవరణంలో తులసి మొక్క ఉండటం మనం చూస్తుంటాము. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం వల్ల తులసి మొక్కను పెద్ద ఎత్తున ఆరాధిస్తారు. ముఖ్యంగా చెట్టుకు సాయంత్రం నీరు పోయకుండా, ఏకాదశి తిథులలో తులసి మొక్కను తుంచకుండా పూజ చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు.
ఉపవాస దీక్షలతో గురువారం అరటి చెట్టును పూజించడం వల్ల శ్రీహరి సంతృప్తి చెంది ఆయన అనుగ్రహం మనపై ఉంటుంది. ఉపవాసంతో అరటి చెట్టుకు మినప పప్పు బెల్లం నైవేద్యంగా సమర్పించి పూజించాలి. ఇలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.