మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు జరిగినా లేదా మన ఇంట్లో పండుగలు జరిగిన గుమ్మానికి మామిడి తోరణాలు దర్శనమిస్తాయి. అయితే మనం చేసే పండగలకు శుభకార్యాలకు మరే ఇతర ఆకులను కాకుండా కేవలం మామిడి ఆకులనే తోరణాలుగా ఎందుకు కడతారో తెలుసా? ఈ విధంగా మామిడి తోరణాలను కట్టడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా మామిడి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తారు.మిగిలిన వృక్షాల మాదిరిగా కాకుండా మామిడి ఆకులను చెట్టు నుంచి కోసిన రెండు మూడు రోజులపాటు ఎంతో తాజాగా, ఆకులలో ఉండే శక్తిని కోల్పోకుండా ఉంటాయి. ఈ మామిడి ఆకులను దేవత స్వరూపాలకు ఆహ్వానం పలికే పత్రాలుగా భావిస్తారు.అందుకోసమే పండుగలు లేదా శుభ కార్యాలు జరిగినప్పుడు గుమ్మానికి మామిడి ఆకులను కట్టడంవల్ల సకల దేవతలను మన ఇంటిలోకి ఆహ్వానించినట్లని పండితులు తెలుపుతున్నారు.
మామిడాకులు ఎంతో ప్రత్యేకమైన వైద్య గుణాలు దాగివున్నాయి. గుమ్మానికి కట్టిన మామిడి ఆకుల నుంచి వచ్చే వాసన పీల్చడం వల్ల మనలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఎటువంటి అంటువ్యాధులు కలగకుండా దోహదపడతాయి. మామిడాకులు గుమ్మానికి కట్టడం వల్ల మన ఇంటికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి.అందుకోసమే అప్పట్లో మన పెద్దవారు ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఒక సాంప్రదాయంగా వస్తోంది.