భగవంతుని ప్రార్ధన, పూజ లేదా భజన చివర్లో లేక గౌరవనీయులైన అతిథిని లేక మహాత్ముడిని ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాము. ఇదెప్పుడూ ఘంటా నాదం తోను కొన్ని సమయములలో పాటలు ఇతర సంగీత వాయిద్యాలతోను, చప్పట్లతోను కలిసి ఉంటుంది. ఇది పదహారు అంచెలుగా చేసే షోడశోపచార పూజా కార్యక్రమములోని ఒక భాగము. ఇది శుభసూచకమైన మంగళ నీరాజనముగా సూచింప బడుతుంది. భగవంతుని రూపాన్ని ప్రకాశింప చేయడానికి మనము కుడిచేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే భగవంతుని సుందర రూపాన్ని ప్రతిభాగము విడిగాను, పూర్తి రూపము శ్రద్ధగా గమనిస్తూ మనసులో గానీ పైకి గట్టిగా గానీ స్తోత్రాలు చదవడము చేస్తాము. ఆ సమయంలో మన ప్రార్ధనలో తపన, భగవంతుని రూపములో ప్రత్యేకమైన సౌందర్యము మనకు అనుభవమవుతుంది.
చివరలో ఆ వెలుగు పై మన చేతులనుంచి తరువాత నెమ్మదిగా మన కళ్ళకు తల పైభాగానికి అద్దుకొంటాము. ఇష్టపూర్వకముగా భగవంతుడిని పూజించినప్పుడు, అభిషేకం చేసినప్పుడు, అలంకరించినప్పుడు, ఫలములు, మధుర పదార్థములతో నివేదించినప్పుడు వైభవోపేతమైన ఆయన సుందర రూపాన్ని చూడగలము. దీపపు వెలుగుచే ప్రకాశవంతము గా కనపడుతున్న భగవంతుని ప్రతి భాగము మీద మనస్సు సంధించబడి అతని రమ్యమైన రూపముపై మనసు మెలకువతో నిశ్శబ్ద ధ్యానం చేస్తుంది. గానం చెయ్యడం చప్పట్లు చరచడం, గంట వాయించడం మొదలైనవన్నీ భగవంతుని దర్శనముతో కల్గిన సంతోషాన్ని, శుభ సూచకాన్ని తెలుపుతాయి. అంతే కాదు, ఈ కర్పూర హారతి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దేవుని పూజలో దేవుని పూజలో ధూపదీపాల్లాగే, కర్పూరంతో ఇచ్చే మంగళ హారతికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ధూపం వల్ల ఏయే ప్రయోజనాలు ఉన్నాయో హారతివల్ల కూడా ఆయా ప్రయోజనాలు నెరవేరుతాయి.
సాధారణంగా దేవునికి కర్పూరంతో హారతి ఇస్తారు. ఇలా కర్పూరంతో హారతి ఇవ్వడమే మంచిది, శ్రేష్టం. కానీ, కొన్ని సందర్భాల్లో నేతిలో నానబెట్టిన దూది వత్తులతో కూడా హారతి ఇస్తారు. కర్పూరం సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుంది. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్చంగా మారుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. కళ్ళకు మంచిది. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది. అంకుకే ఒక శుభ్రమైన వస్త్రంలో కొన్ని బియ్యపుగింజలు, కొద్దిగా కర్పూరం వేసి దాన్ని చిన్న ముడిలా చుట్టి ఆ వాసన పీలుస్తారు. ఇలా చేయడంవల్ల జలుబు తగ్గుతుంది, పూడుకుపోయిన ముక్కు యధాస్థితికి వస్తుంది. కర్పూరం అతి దాహం, ముఖ శోష లాంటి అనారోగ్యాలను నివారిస్తుంది. మంటలు, దురదలు లాంటి చర్మ వ్యాధులకు బాగా పనిచేస్తుంది. వాత, పిత్తాలను హరిస్తుంది. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది. గొంతు పూడుకుపోవడం, స్వరపేటికలో ఉండే దోషాలను నివారిస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పొతే, కర్పూరం వల్ల అసంఖ్యాకమైన ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీపురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం ఒక చక్కటి ఆధ్యాత్మికవాతావరణాన్ని సృష్టిస్తుంది కర్పూరం. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది కర్పూరం. కర్పూరంలో అనేక రకాలు ఉన్నాయి. హిమ కర్పూరం, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం, పచ్చ కర్పూరం మొదలైనవి ముఖ్యమైనవి. ఇన్ని ఔషధ గుణాలు కలది, అద్భుతమైంది కనుకనే కర్పూరంతో మంగళ హారతి ఇస్తారు.