నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రం ఆదిత్య 369. ఈ చిత్రం సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కింది. 1991లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ ‘ఆదిత్య 369’ అప్పట్లో అందరినీ అలరించింది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన అభినయం ప్రేక్షకులను మైమరిపించింది అనే చెప్పాలి. ఇప్పటికీ కూడా ఈ సినిమా టీవీలలో వస్తే ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన బాలకృష్ణకు ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు తన తనయుడు మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మాక్స్’ పేరుతో తీయనున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు.
తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా దీన్ని రూపొందిస్తానని అన్నారు. అంతేకాదు మోక్షజ్ఞని పరిచయం చేస్తూ సినిమా చేయాలని ఉందని, తానే దర్శకత్వం వహిస్తానని కూడా ఆయన చెప్పారు. తానే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు కూడా తెలిపారు. అయితే ఎందుకో మనసు మార్చుకొని మోక్షజ్ఞని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పరిచయం చేయస్తున్నారు బాలయ్య. `సింబా` పేరుతో ఈ మూవీ రూపొందుతుంది. బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ మూవీతో నిర్మాతగానూ పరిచయం కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో మోక్షజ్ఞ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతుందనే టాక్ ఉంది.
అయితే ఆగిపోయిందనుకున్న ఆదిత్య 999 త్వరలోనే పట్టాలెక్కనుందట మోక్షజ్ఞ మెయిన్ హీరోగా ఈ సినిమాని తీయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని బాలయ్య `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోలో ప్రకటించారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోందనీ, మోడరన్ సినిమాటిక్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. అన్నీ కుదిరితే 2025లో విడుదల చేసే అవకాశం ఉంది’’అని చెప్పారు బాలయ్య . డిసెంబర్ 6న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ ‘ఆదిత్య 369’ గెటప్‌లో కనిపించనున్నారు.