ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సినిమాలు సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇందులో నటించిన నటీనటులకు అంతర్జాతీయ స్థాయిలు గుర్తింపు దక్కిందంటే అది రాజమౌళి ఘనతే అని చెప్పవచ్చు. ఈ చిత్రాలు రెండు కలిసి దాదాపుగా రూ.3వేల కోట్ల వసూళ్లను సాధించాయని ట్రేడ్ పండితులు చెబుతుంటారు. అయితే వసూళ్ల విషయం ఏమో గానీ బాహుబలి సినిమా కోసం ఆ యూనిట్ సభ్యులు పడని కష్టం అంటూ లేదు. ముఖ్యంగా హీరో ప్రభాస్ అయితే చాలా కష్టాలను ఎదుర్కొన్నాడట. అది కూడా డబ్బు పరంగా..! ఈ విషయాన్ని సాక్షాత్తూ దర్శకుడు రాజమౌళే చెప్పాడు.
బాహుబలి 1, 2 సినిమాలను 5 ఏళ్ల పాటు కష్టపడి తీశారు కదా. అయితే ఆ సమయంలో ప్రభాస్‌కు చాలా ఆఫర్లు వచ్చాయి. చాలా మంది నిర్మాతలు ప్రభాస్ ఇంటికి క్యూ కట్టారట. సినిమా ఒప్పుకుంటే అడ్వాన్స్ ఇస్తామని చాలా మంది నిర్మాతలు ఆశ చూపారట. అయినప్పటికీ వాటన్నింటినీ ప్రభాస్ తిరస్కరించాడట. తనకు బాహుబలి సినిమాయే ముఖ్యమని, అవి రెండు పార్ట్‌లు అయ్యాకే వేరే ఎవరికైనా సినిమా చేస్తానని కచ్చితంగా చెప్పేశాడట ప్రభాస్. అంతేకాదు, సినిమా కోసం ఎవరు వచ్చి అడ్వాన్స్ ఇచ్చినా తీసుకోవద్దని కూడా తన మేనేజర్‌కు ఆదేశాలిచ్చాడట ప్రభాస్.
అయితే బాహుబలి రెండు పార్ట్‌లను 5 ఏళ్ల పాటు తీయడం, ఆ సమయంలో వచ్చిన ఆఫర్లను వద్దనడంతో ప్రభాస్‌కు ఓ దశలో ఆర్థికంగా సమస్యలు చుట్టు ముట్టాయట. అతనికి డబ్బు బాగా అవసరం అయిందట. దీంతో ఏం చేయాలని ప్రభాస్ రాజమౌళిని అడిగాడట. అందుకు రాజమౌళి ఏమన్నాడంటే… సినిమా కోసం కాక వేరే విధంగా ఇస్తున్న డబ్బు అని నిర్మాతలతో అఫిడవిట్ రాయించుకోమని రాజమౌళి ప్రభాస్‌కు చెప్పాడట. అయితే ప్రభాస్‌కు ఆ సూచన నచ్చలేదట. దీంతో నిర్మాతలు డబ్బు ఇస్తామన్నా ప్రభాస్ వద్దనేశాడట. డబ్బులు తీసుకుంటా సరే… రేప్పొద్దున సినిమా చేయకపోతే అప్పుడు తిరిగివ్వాలి కదా. అప్పుడేం చేయాలి..? అని ప్రభాస్ రాజమౌళిని అడిగాడట. తనకు ఒకర్ని మోసం చేయడం నచ్చదని, తన వల్ల ఒకరికి నష్టం కలగవద్దని, ఎవరూ బాధపడవద్దని ప్రభాస్ రాజమౌళితో అన్నాడట. అంతటి మంచి మనస్సు ఉన్న వ్యక్తి ప్రభాస్ అని రాజమౌళి కొనియాడారు. ఇతరులు బాధ పడితే ప్రభాస్ చూడలేడు అని ఆయన ప్రభాస్‌కు కితాబిచ్చారు. అవును మరి, అంత ఓపిక, సహనం, మంచి మనస్సు ఉంది కాబట్టే ప్రభాస్ బాహుబలి కోసం 5 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. అందుకనే అతనికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. అయితేనేం… ఇప్పుడు ప్రభాస్ నేషనల్ స్థాయి దాటి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడు. అది తెలుగు వారిగా మనందరికీ గర్వకారణమే కదా..!