పూరీ జగన్నాథ్ దృష్టిలో ఇదొక ఫ్లూక్ సినిమా, తన దగ్గర ఉన్న వందల చెత్త కధలలో ఇదొక సినిమా. పూరీకి ఈ సినిమా మీద ఉన్న నమ్మకం అంత వరకే. కానీ ఫస్ట్ రష్ చూసిన కృష్ణ చెప్పిన మాట, ఈ సినిమా ఇండస్ట్రి హిట్ అవుతాది అంటే, మీ అబ్బాయి కాబట్టి అలా చెబుతున్నారా అన్నాడు పూరీ. 350 సినిమాల నటుడు, నిర్మాత, దర్శకుడి విశ్లేషణ తన సినిమాలో తను చేయలేకపోయాడు పూరీ. ప్రయత్నం అందరూ ఒకేలా చేస్తారు, కానీ తీసుకునే జాగ్రత్తలు సినిమాని ముందుకి తీసుకెళతాయి.
అప్పటివరకు ఉన్న మూస సినిమాలకన్నా పోకిరి చాలా భిన్నం. ఆంగ్ల చిత్రాల మాదిరి సీన్లు చాలా వేగంగా నడుస్తాయి. చిన్న నిడివి ఉన్న సినిమా, మరీ పెద్దది ఏమి కాదు. సందర్భానికి తగ్గ పాటలే తప్ప బలవంతంగా చొప్పించినవి లేవు. ఒక్కడు తరువాత ఫుల్ మాస్ సినిమా మహేష్ కి ఇదే. అప్పటికే వచ్చిన అతడు లో నటన కూడా ఐదు మార్కులు ఎక్కువ జత చేసింది. ప్రియురాలు వదిలేసినా అండర్ కవర్ కాప్ గానే ఉంటాడు తప్ప మేలోడ్రామా నడిపించడు. అలీ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, నాజర్, మాస్టర్ భరత్, షాయాజీ షిండే, సుబ్బరాజు ఇలా ప్రతీ పాత్రని ఒక్కొక్కటి పరిచయం చేసుకుంటూ సినిమా వెళుతుంది. లాజిక్ మిస్ అయిన సీన్ ఒక్కటి కూడా లేదు. మణిశర్మ, పూరీ, మహేష్, ఇలియానా, ఫైట్ మాస్టర్ విజయ్, ఇలా ప్రతి ఒక్కరి కష్టానికి తగిన ఫలితం ఇచ్చిన సినిమా.
నిజానికి చాలా థ్రిల్లర్ లేదా యాక్షన్ సినిమాలలో ట్విస్ట్ ఒకసారి తెలిసాక రెండవసారి చూడాలి అనిపించదు. పోకిరి ట్విస్ట్ మొదటిసారి చూడకపోయినా ముందే తెలుసు, చూశాక కూడా మళ్ళీ చూడాలి అనిపించేలా చిత్రీకరణ, భారీ సెట్స్ లేకుండా చిన్న చిన్న ప్రదేశాలలోనే సినిమా తీసుకోవడం ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి. రిపీట్ వాల్యూ బాగా ఎక్కువ ఉన్న సినిమా. మహేష్ తరం నటులు అప్పటివరకు చేసిన సినిమాలకన్నా ఎక్కువ ఆదాయం తెచ్చిన సినిమా. అందులో 75 ఏళ్ల వజ్రోత్సవ వేడుకలు, అప్పటికి హీట్ లో ఉన్న సినిమా, సమ్మర్ సెలవులు, ముందే ఆడియో హిట్, మహేష్ లుక్ ఇలా అన్నీ అంశాలు కలిసి హిట్ చేశాయి. గెలుపు ని ఎలా తీసుకోవాలో తెలియక సదరు దర్శకుడు అప్పటినుండి ఇప్పటివరకు ఫ్లాప్స్ కొడుతూనే ఉన్నాడు, అప్పుడప్పుడు ఫ్లాప్స్ పడినా మహేష్ మరొక స్థాయి హీరో అనిపించుకున్నాడు. ఈ సినిమా క్రూ అందరికీ లాండ్ మార్క్ గా కలిసొచ్చింది.