వాకింగ్ లేదా రన్నింగ్. రెండింటిలో ఏది చేసినా అది మనకు శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది. దాంతో బరువు తగ్గడమే కాదు, అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే ముఖ్యంగా వాకింగ్ కన్నా రన్నింగ్ చేస్తే ఎక్కువ వేగంగా క్యాలరీలు ఖర్చవుతాయి. బరువు తగ్గుతారు. ఎక్సర్‌సైజ్ పరంగా ఈ రెండింటిలో ఎవరైనా తమ అనకూలతలను బట్టి దేన్నయినా చేయవచ్చు. అయితే వాకింగ్ లేదా రన్నింగ్ ఏది చేసినా ఇవి రెండు సురక్షితమైన ఎక్సర్‌సైజ్‌లే. వీటి వల్ల మనం పెద్దగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో వీటి వల్ల గాయాలకు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. అవి ఏ తరహా గాయాలో, అవి కాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్లాంటార్ ఫసైటిస్ ( Plantar Fasciitis)
ఈ తరహా గాయం ఎందుకు అవుతుందంటే కరెక్ట్‌గా ఫిట్ అవని ఫుట్‌వేర్ వేసుకుని వాకింగ్ లేదా రన్నింగ్ చేస్తే ఇలాంటి గాయాలు అవుతాయి. పాదం ముందు భాగంలో కింద ఉండే కణజాలం దెబ్బ తింటుంది. కనుక సరైన ఫుట్‌వేర్ వాడితే ఈ గాయం బారిన పడాల్సిన అవసరం ఉండదు.
2. ఏకిల్లెస్ టెండినోపతి (Achilles Tendinopathy)
పిక్కలకు మడమలకు మధ్య ఉండే ఈ భాగంలో ఈ గాయం అవుతుంది. ఎక్కువగా మడమలను ఉపయోగించి వాకింగ్ లేదా రన్నింగ్ చేస్తే ఈ సమస్య వస్తుంది. కనుక పాదాలను నేలపై బ్యాలెన్స్ చేస్తూ వాకింగ్ లేదా రన్నింగ్ చేయాలి. దీంతో ఈ గాయం అవదు.
3. షిన్ స్ల్పింట్స్ (Shin Splints)
కాలు ముందు, లోపలి భాగంలో నొప్పి వస్తుంది. ఈ తరహా గాయం ఎందుకు అవుతుందంటే ఒకే తరహా నేలపై కాకుండా వివిధ రకాల నేలలపై ఎక్కువ సేపు వాకింగ్ లేదా రన్నింగ్ చేస్తే ఇలాంటి నొప్పి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకే రూపంలో ఉండే నేలపైనే ఎక్సర్‌సైజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ సమస్య రాదు.
4. రన్నర్స్ నీ (Runner’s Knee)
మోకాళ్లలో నొప్పి వస్తుంది. దీన్నే రన్నర్స్ నీ అని అంటారు. ఈ తరహా గాయం ఎందుకు అవుతుందంటే రన్నింగ్ చేసే వారు ఎక్కువగా మోకాళ్లపై బరువు మోపితే ఇలా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఆ భాగంపై అంత బరువు వేయవద్దు. దీంతో సమస్య ఉత్పన్నం కాదు.
5. ఇలియోటిబియల్ బ్యాండ్ సిండ్రోమ్ (Iliotibial Band Syndrome)
తొడ నుంచి మోకాలి మధ్య భాగంలో ఈ గాయం అవుతుంది. నొప్పి వస్తుంది. అయితే ఇది సహజమే. ఈ నొప్పి సాధారణంగా వాకింగ్, రన్నింగ్ ప్రారంభంలో లేదా చివర్లో వస్తుంది. కొంత సేపు రెస్ట్ తీసుకుంటే చాలు పోతుంది.
6. మజిల్ పుల్ (Muscle Pull)
తొడ కండరాలు, పిక్కలు పట్టేస్తాయి. ఈ గాయం ఎందుకు అవుతుందంటే ఆయా కండరాలపై ఒత్తిడి ఎక్కువగా పడితే మజిల్ పుల్ వస్తుంది. కొంత సేపు రెస్ట్ తీసుకుంటే దీన్నుంచి బయట పడవచ్చు.
7. స్ట్రెస్ ఫ్రాక్చర్ (Stress Fracture)
వాకింగ్ లేదా రన్నింగ్ ఒకే వేగంతో చేయకుండా వెంట వెంటనే మార్చి మార్చి వేగాలతో చేస్తే ఈ గాయం అవుతుంది. అలా కాకుండా ఒకే వేగంతో కాన్‌స్టంట్‌గా వాకింగ్ లేదా రన్నింగ్ చేస్తే ఎలాంటి సమస్య రాదు.
8. లోయర్ బ్యాక్ పెయిన్ (Lower Back Pain)
వాకింగ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు సరైన భంగిమలో శరీరాన్ని ఉంచుకుండా అడ్డ దిడ్డంగా ఉంచుతూ ఎక్సర్‌సైజ్ చేస్తే ఈ తరహా గాయం అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు కరెక్ట్ భంగిమను మెయింటెయిన్ చేయాలి. దీంతో ఈ సమస్య రాదు.