Morning Exercise : మనలో చాలా మందికి రోజూ వ్యాయమం చేసే అలవాటు ఉంది. బరువు తగ్గడానికి, ఫిట్ గా ఉండడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజూ వ్యాయామం చేస్తూ ఉంటారు. అలాగే ఎవరి వీలుని బట్టి వారు ఉదయం, సాయంత్రం సమయాల్లో వ్యాయామం చేస్తూ ఉంటారు. అయితే వ్యాయామం ఏ సమయంలో చేసిన మేలు కలిగినప్పటికి ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల మనకు మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట వ్యాయామం మనకు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని వారు చెబుతున్నారు. ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల మనకు కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల శరీరంలో జీవక్రియ మెరుగుపడుతుంది. అధిక క్యాలరీలు ఖర్చు అవుతాయి.
అలాగే ఉదయం పూట చేసే వ్యాయామం మనలో మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్ ను ఎక్కువగా విడుదల అయ్యేలా చేయడంలో సహాయపడుతుంది. ఎండార్ఫిన్ ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల ఒత్తిడి, నిరాశ, నిస్పృహ, ఆందోళన వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. మానసిక స్థితి మెరుగుపడుతుంది. రోజంతా మనం సానుకూల శక్తిని కలిగి ఉంటాము. ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. నిద్రలేమి మన దరి చేరకుండా ఉంటుంది. శరీరం యొక్క సిర్కాడియన్ రిథమ్ ను నియంత్రించడంలో ఉదయం చేసే వ్యాయమం మనకు సహాయపడుతుంది. దీంతో మనం రాత్రిపూట చక్కగా నిద్రపోగలుగుతాము. అలాగే ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల ఆకలి తగ్గుతుంది. రోజంతా ఆకలి నియంత్రణలో ఉంటుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది.
దీంతో మనం అతిగా ఆహారాన్ని తీసుకోలేము. తద్వారా మన శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రవాహం పెరుగుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి కండరాలకు, కణజాలాలకు పోషకాలు, ఆక్సిజన్ చక్కగా అందుతాయి. దీంతో మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. అదేవిధంగా ఉదయం పూట క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా ఉదయం పూట క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.