Raw Coconut Sweet : కొబ్బరి స్వీట్.. కొబ్బరి పాలతో చేసే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో ఈ స్వీట్ ను తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు, స్పెషల్ డేస్ లో బయట కొనడానికి బదులుగా చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసి తీసుకోవచ్చు. ఈ స్వీట్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, కమ్మగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా, మృదువుగా ఉండే ఈ కొబ్బరి స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – ఒకటిన్నర కప్పు, గోరు వెచ్చని నీళ్లు – అర కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్స్, బొంబాయి రవ్వ – పావు కప్పు, గోధుమపిండి – ముప్పావు కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, పంచదార – ఒకటిన్నర కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
కొబ్బరి స్వీట్ తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత నీళ్లు పోసి మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని శుభ్రమైన వస్త్రంలో వేసి గట్టిగా పాలు పిండి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత రవ్వ వేసి వేయించాలి. రవ్వ చక్కగా వేగిన తరువాత గోధుమపిండి వేసి వేయించాలి. దీనిని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత కొబ్బరి పాలు వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పాకం కోసం కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి గులాబ్ జామున్ పాకం వచ్చిన తరువాత కొద్దిగా యాలకుల పొడి వేసి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పిండిని చేత్తో బాగా వత్తుతూ కలుపుకోవాలి.
పిండి మెత్తగా ఉంటే కొద్దిగా పిండి వేసి కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే కొద్దిగా పాలు పోసి కలుపుకోవాలి. తరువాత దీనిని సమానమైన ఉండలుగా చేసుకోవాలి. తరువాత కట్లెట్ లాగా వత్తుకుని పైన మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న గులాబ్ జామున్ లాగా కూడా వత్తుకోవచ్చు. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వత్తుకున్న గులాబ్ జామున్ లను నూనెలో వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత బయటకు తీసి వెంటనే సిద్దంగా ఉంచుకున్న పాకంలో వేసుకోవాలి. వీటిని అరగంట నుండి గంట పాటు అలాగే పాకం ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి స్వీట్ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన కొబ్బరి స్వీట్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.