ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాల విషయంలో చాలా మంది అనేక జాగ్రత్తలను తీసుకుంటారు. చక్కని పౌష్టికాహారం తీసుకుంటారు. బాగానే ఉంటుంది. కానీ రాత్రి పూట కూడా అలాంటి ఆహారమే తీసుకోవాలి. అయితే చాలా మంది రాత్రి పూట ఎక్కువగా అధిక క్యాలరీలను ఇచ్చే ఆహారాలను తింటారు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆయుర్వేద ప్రకారం రోజులో చివరి భాగాన్ని కఫ దోషం నియంత్రిస్తుంది. కనుక కఫ దోషాన్ని సమం చేసే ఆహారాలను మాత్రమే మనం రాత్రి పూట తినాల్సి ఉంటుంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి పూట తినాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. తక్కువ పిండి పదార్థాలు
రాత్రి పూట తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో తేలిగ్గా జీర్ణమవుతాయి. రాత్రి పూట ఎక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాలను తింటే జీర్ణాశయంలో అసౌకర్యం కలుగుతుంది. దీంతో నిద్రలేమి సమస్య వస్తుంది. నిద్రాభంగం అవుతుంది. అలాగే స్థూలకాయం, డయాబెటిస్ వంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అదే తేలిగ్గా జీర్ణమయ్యే, తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాలను తీసుకుంటే అవి త్వరగా జీర్ణమవుతాయి. మరుసటి రోజు ఉదయం లైట్‌గా ఫీలవ్వచ్చు. శరీరం తేలిగ్గా అనిపిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
2. పెరుగు
రాత్రి పూట చాలా మంది పెరుగు తింటారు. కానీ ఆయుర్వేద ప్రకారం రాత్రి పూట పెరుగును తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. దీంతో శ్లేష్మం ఎక్కువవుతుంది. శ్వాస కోశ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ముక్కు దిబ్బడ ఇబ్బందులకు గురి చేస్తుంది. అందువల్ల రాత్రి పూట పెరుగు తినరాదు. అందుకు బదులుగా పలుచని మజ్జిగను సేవించవచ్చు.
3. అతిగా తినడం
రాత్రి పూట కొందరు అతిగా తింటారు. దీని వల్ల అజీర్ణ సమస్య ఏర్పడుతుంది. ఇది మరిన్ని సమస్యలను తెచ్చి పెడుతుంది. కనుక రాత్రి పూట ఎంత తక్కువ ఆహారం తింటే అంత మంచిది. అలాగే అందులో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. దీంతో జీర్ణ సమస్య ఏర్పడదు.
4. ప్రోటీన్లు
రాత్రి పూట ఆహారంలో పప్పులు, ఆకు పచ్చని కూరగాయలు, కరివేపాకులు తీసుకోవాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
5. పాలు
రాత్రి పూట వెన్న తీసిన పాలను తాగితే మంచిది. అందులో కొద్దిగా తేనె కలుపుకుని తాగవచ్చు. వేడి పాలలో తేనె కలుపుకుని తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. నిద్ర సరిగ్గా పడుతుంది. పాలల్లోని పోషకాలు శరీరానికి అందుతాయి. తేనెతోపాటు కొద్దిగా అల్లం రసం, యాలకుల పొడిని కూడా పాలలో కలుపుకుని తాగవచ్చు.
6. మసాలా దినుసులు
రాత్రి పూట ఆహారంలో దాల్చిన చెక్క పొడి, సోంపు గింజల పొడి, మెంతుల పొడి, యాలకుల పొడిలను తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
7. ఉప్పు
రాత్రి పూట ఉప్పును అసలు తీసుకోకపోవడమే మంచిది. సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను రాత్రి పూట తినడం వల్ల హైబీపీ, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది.