మొలకెత్తిన గింజలు లేదా విత్తనాలు. వేటిని నిత్యం తిన్నా సరే మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మొలకెత్తిన గింజలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. అయితే ఏయే గింజలు, విత్తనాలను ఎంత సేపు నానబెట్టాల్సి ఉంటుంది ? అవి మొలకలు వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* బాదంపప్పును 8 నుంచి 12 గంటల పాటు నానబెట్ట వచ్చు. అవి మొలకలు వచ్చేందుకు సుమారుగా 12 గంటల సమయం పడుతుంది.
* బార్లీ గింజలు అయితే 6 నుంచి 8 గంటల్లో నానుతాయి. అవి మొలకెత్తేందుకు మాత్రం 2 రోజుల సమయం పడుతుంది.
* బ్రొకొలి విత్తనాలను 8 గంటల పాటు నానబెట్టాలి. అవి 3 నుంచి 6 రోజుల్లో మొలకలు వస్తాయి.
* శనగలను 12 గంటల పాటు నానబెట్టాలి. 12 గంటల్లో మొలకలు వస్తాయి. పల్లీలకు కూడా దాదాపుగా ఇదే సమయం పడుతుంది.
* గుమ్మడికాయ విత్తనాలు అయితే 8 గంటల పాటు నానబెడితే 1 రోజులో మొలకలు వస్తాయి.
* క్వినోవా గింజలను 2 గంటల పాటు నానబెడితే చాలు. 1 రోజులో మొలకెత్తుతాయి.
* నువ్వులను 8 గంటలు నానబెట్టాలి. 1-2 రోజుల్లో మొలకలు వస్తాయి.
* పొద్దు తిరుగుడు విత్తనాలను 2 గంటలు నానబెట్టాలి. 2-3 రోజుల్లో మొలకలు వస్తాయి.
* పెసలను 8 గంటల పాటు నానబెడితే 12 గంటల్లోగా మొలకలు వస్తాయి.
* పల్లీలను 12 గంటల పాటు నానబెడితే మరో 12 నుంచి 14 గంటల్లోగా మొలకలు వస్తాయి.
గింజలు లేదా విత్తనాలను బాగా నానబెట్టాక వాటిని తీసి శుభ్రమైన వస్త్రంలో చుట్టి ఉంచాలి. దీంతో నిర్ణీత సమయంలోగా మొలకలు వస్తాయి. అయితే కొన్నిసార్లు మొలకలు వచ్చేందుకు ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు వేచి చూడాలి. లేదా తరువాత మళ్లీ వాటిని నానబెట్టేటప్పుడు కాస్తంత ఎక్కువ సమయం ఉంచాలి. దీంతో మొలకలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.