Banana Pan Cake : బనానా ప్యాన్ కేక్.. అరటిపండుతో చేసే ఈ ప్యాన్ కేక్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా , స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది దీనిని తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్యాన్ కేక్ ను చాలా మంది మైదాపిండితో తయారు చేస్తూ ఉంటారు. మైదాపిండి ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక ఈ ప్యాన్ కేక్ ను మనం గోధుమపిండితో కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసే ఈ బనానాప్యాన్ కేక్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ బనానా ప్యాన్ కేక్ ను ఎలా తయారు చేసుకోవాలో… ఇప్పుడు తెలుసుకుందాం.
బనానా ప్యాన్ కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అరటిపండు – 1, బెల్లం పొడి – 3 టేబుల్ స్పూన్స్, కోడిగుడ్డు – 1, నూనె – ఒక టేబుల్ స్పూన్, పాలు – అర కప్పు, గోధుమపిండి – ఒక కప్పు, వంటసోడా – పావు టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, వెనీలా ఎసెన్స్ – 1/3 టీ స్పూన్.
బనానా ప్యాన్ కేక్ తయారీ విధానం..
ముందుగా జార్ లో అరటిపండును ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత బెల్లం పొడి, కోడిగుడ్డు, నూనె, పాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. ఇందులో వంటసోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తరువాత అరటిపండు మిక్స్ వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తరువాత వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక దానిపై నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత గంటెతో పిండిని తీసుకుని ఊతప్పంలాగా వేసుకోవాలి. ప్యాన్ కేక్ పైన తడి ఆరిన తరువాత నెయ్యి వేసి కాల్చుకోవాలి. దీనిని ఒకవైపు ఎర్రగా కాల్చుకున్న తరువాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బనానా ప్యాన్ కేక్ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు.