Cold Coco : మనం కాఫీ షాపుల్లో రకరకాల చాక్లెట్ డ్రింక్స్ ను, చాక్లెట్ మిల్క్ షేక్స్ నపు తాగుతూ ఉంటాం. మనకు రోడ్ల పక్కన షాపుల్లో కూడా చాక్లెట్ డ్రింక్స్ లభిస్తూ ఉంటాయి. మనకు లభించే వివిధ రకాల చాక్లెట్ డ్రింక్స్ లో కోల్డ్ కోకో కూడా ఒకటి. ఈ చాక్లెట్ డ్రింక్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎంత తాగినా తనివి తీరదనే చెప్పవచ్చు. వేసవి కాలంలో తాగడానికి ఇది ఒక్క చక్కటి డ్రింక్ అని చెప్పవచ్చు. ఈ కోల్డ్ కోకోను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా దీనిని తేలికగా చేసుకోవచ్చు. చల్లచల్లగా రుచిగా ఉండే ఈ కోల్డ్ కోకో తయారీ విధానాన్ని.. అలాగే తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కోల్డ్ కోకో తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్, చిక్కటి పాలు – 500 ఎమ్ ఎల్, పంచదార – 3 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్స్, డార్క్ చాక్లెట్ చంక్స్ – అర కప్పు, చాక్లెట్ సిరప్ – కొద్దిగా.
కోల్డ్ కోకో తయారీ విధానం..
ముందుగా కళాయిలో నీళ్లు పోయాలి. తరువాత 400 ఎమ్ ఎల్ పాలు పోసి కలుపుతూ వేడి చేయాలి. పాలు పొంగు వచ్చిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగే లోపు మరో గిన్నెలో 100 ఎమ్ ఎల్ పాలు తీసుకోవాలి. తరువాత ఇందులో కార్న్ ఫ్లోర్, కోకో పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి. తరువాత డార్క్ చాక్లెట్ చంక్స్ వేసి అవి కరిగే వరకు కలుపుతూ ఉండాలి. చాక్లెట్ కరిగిన తరువాత ఈ పాలను వడకట్టి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ గిన్నెను 5 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. పూర్తిగా చల్లారిన ఈ పాలను బ్లెండర్ లో వేసి హైస్పీడ్ మీద బీట్ చేసుకోవాలి. తరువాత సర్వింగ్ గ్లాస్ ను తీసుకుని దాని అంచుల వెంబడి చాక్లెట్ సిరప్ ను వేసుకోవాలి. తరువాత బీట్ చేసుకున్న చాక్లెట్ పాలను పోసుకోవాలి. ఈ పాలపై డార్క్ చాక్లెట్ ముక్కలను వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోల్డ్ కోకో తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.