Ghee At Home : మనలో చాలా మంది భోజనం చేసేటప్పుడు అన్నంలో, కూరలల్లో నెయ్యివేసుకుని తింటూ ఉంటారు. నెయ్యి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ నెయ్యిని, నెయ్యితో చేసిన ఆహారాలను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. అలాగే నెయ్యి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నేటి తరుణంలో మనలో చాలా మంది బయట మార్కెట్ లో లభించే నెయ్యిని మాత్రమే వాడుతున్నారు. అయితే బయట కల్తీ నెయ్యితో పాటు ఎటువంటి సువాసన, రుచి లేని నెయ్యి లభిస్తుంది. ఇటువంటి కల్తీ నెయ్యిని తినడం వల్ల ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. బయట మార్కెట్ లో లభించే నెయ్యిని కొనడానికి బదులుగా మనం ఇంట్లోనే చాలా సులభంగా నెయ్యిని తయారు చేసుకోవచ్చు.
నెయ్యిని ఏ విధంగా తయారు చేయవచ్చో మనందరికి తెలిసిందే. సాధారణంగా పాలను తోడు బెట్టగా వచ్చిన పెరుగు మీద మీగడతో మనం నెయ్యిని తయారు చేస్తూ ఉంటాము. ఇలా కాకుండా పెరుగు తోడు బెట్టే పని లేకుండా నేరుగా పాలతో కూడా మనం నెయ్యిని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన నెయ్యి మరింత సువాసనతో, కమ్మగా ఉంటుంది. పాలతో నెయ్యిని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా చిక్కటి పాలను గిన్నెలో పోసి మరిగించాలి. పాలు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఈ పాలను ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ తరువాత బయటకు తీయాలి. ఇప్పుడు పాలపై మీగడ తయారవుతుంది. ఈ మీగడను తీసి గిన్నెలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా పది రోజుల పాటు తయారు చేసుకున్న మీగడను బయటకు తీసిన తరువాత ఒక గిన్నెలో నీటిని పోసి అందులో మీగడ గిన్నెను ఉంచి వేడి చేయాలి.
మీగడ కరిగి గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో 2 టీ స్పూన్ల పెరుగు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజూ ఇందులో ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల వెన్న తయారవుతుంది. ఈ వెన్నను తీసి నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. నీరు తెల్లగా వచ్చే వరకు వెన్నను బాగా కడిగి నీళ్లు లేకుండా వడకట్టి అడుగు మందంగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ వెన్నను మధ్యస్థ మంటపై కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించాలి. తరువాత ఈ స్టవ్ ఆఫ్ చేసి నెయ్యిని చల్లారబెట్టాలి. నెయ్యి చల్లారిన తరువాత వడకట్టి డబ్బాలో పోసి కదిలించకుండా అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల నెయ్యి కమ్మగా, రుచిగా ఉండడంతో పాటు పూస పూసగా తయారవుతుంది. ఈ విధంగా మిక్సీ, కవ్వంతో పనే లేకుండా చాలా సులభంగా కమ్మటి నెయ్యిని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన నెయ్యిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.