Sorakaya Payasam : మనం తరచూ వంటింట్లో పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా వివిధ రకాల పాయసాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో ఒకటైన సొరకాయతో పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సొరకాయను మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సొరకాయ ఎంతో ఉపయోగపడుతుంది. సొరకాయతో మనం పచ్చళ్లను, కూరలను తయారు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా సొరకాయతో ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయతో పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ తురుము – ఒక కప్పు, పంచదార – ముప్పావు కప్పు లేదా రుచికి తగినంత, జీడి పప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, పాలు – రెండు కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, సేమ్యా – అర కప్పు, నీళ్లు – రెండు గ్లాసులు.
సొరకాయ పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తరువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత మరి కొద్దిగా నెయ్యిని వేసి నెయ్యి వేడయ్యాక సొరకాయ తురుమును వేసి వేయించుకోవాలి. సొరకాయ తురుము వేగిన తరువాత అందులోనే సేమ్యాను వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత రెండు గ్లాసుల నీటిని పోసి కలుపుతూ సేమ్యాను పూర్తిగా ఉడికించాలి. తరువాత పంచదారను వేసి పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత పాలను, యాలకుల పొడి, ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసి కలిపి 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పాయసం తయారవుతుంది. సొరకాయతో తరచూ చేసే వంటలకు బదులుగా ఇలా అప్పుడప్పుడూ పాయసాన్ని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా దీన్ని తింటారు.