సాధారణంగా మనం శని దేవుడిని శని అని పిలుస్తుంటారు. అదేవిధంగా మరికొందరు శనీశ్వరుడు అని పిలుస్తుంటారు. శని దేవుడిని ఈ విధంగా శనీశ్వరుడు అని పిలవడానికి గల కారణం ఏమిటి? శని ఎందుకు శనీశ్వరుడుగా మారాడు.. శనికి, శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం ఒకరోజు శనిదేవుడు పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థం కైలాసానికి చేరుకుంటాడు. శని దేవుడి విధి ధర్మాన్ని పరీక్షించాలని భావించిన పరమేశ్వరుడు శనితో ఈ విధంగా అంటాడు. శని నీవు నన్ను పట్టగలవా? అని అడగగా అందుకు శని మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రంలోగా మీరు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటానని చెబుతాడు. మరుసటి రోజు ఉదయం శివుడు ఎవరికీ కనిపించకుండా బిల్వ వృక్ష రూపమెత్తి దాక్కొని ఉంటాడు.
ఈ విధంగా పరమేశ్వరుడు కనిపించకపోవడంతో ముక్కోటి దేవతలు పరమేశ్వరుడి కోసం వెతక సాగారు.సూర్యాస్తమయం కావస్తున్న సమయంలో పరమేశ్వరుడు బిల్వవృక్షం నుంచి బయటకు రాగానే అతని ముందు శనీ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శివుడు శని నన్ను పట్టుకోలేకపోయావే అని అనగా, అందుకు శని నేను పట్టుకోవడం వల్లే కదా మీరు ఉదయం నుంచి బిల్వవృక్షంలో ఉన్నారు అని చెప్పగానే శని విధి నిర్వహణకు పరవశించిపోయిన పరమేశ్వరుడు శనితో ఈ విధంగా అంటాడు.
పరమేశ్వరుడైన నన్నే పట్టుకొని కొంతకాలం పాటు నాతోనే ఉన్నావు కనుక ఇప్పటి నుంచి నీవు శనీశ్వరునిగా ప్రసిద్ధి చెందుతావని చెప్పాడు. అదేవిధంగా ఎవరికైతే శని బాధలు, శని దోషం ఉంటుందో వారు పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజ చేయడం వల్ల శని ప్రభావం ఉండదని అభయమిచ్చాడు.అందుకే మనం శనీశ్వరుడిని ఎప్పుడు శని అని పిలవకుండా శనీశ్వరుడు గానే సంబోధించాలని పురాణాలు చెబుతున్నాయి.