Vada Curry : త‌మిళ‌నాడు స్టైల్‌లో ఎంతో రుచిక‌ర‌మైన వ‌డ క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

Vada Curry : వ‌డ క‌ర్రీ.. త‌మిళ‌నాడులో ఎక్కువ‌గా చేసే ఈ వ‌డ‌క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా వ‌డ‌ల‌తో కర్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌మిళ‌నాడు స్పెష‌ల్ అయిన ఈ వ‌డ‌క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వ‌డ కర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి తురుము – అర చిప్ప‌, సోంపు గింజ‌లు – ఒక టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, జాజికాయ – చిన్న‌ది ఒక‌టి, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన టమాటాలు – పెద్ద‌వి రెండు, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 100 ఎమ్ ఎల్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నెయ్యి -2 టేబుల్ స్పూన్స్.

Vada Curry recipe in telugu make like tamilnadu style
Vada Curry

వ‌డ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

5 గంట‌ల పాటు నాన‌బెట్టిన శ‌న‌గ‌ప‌ప్పు – ఒక కప్పు, ఎండుమిర్చి- 6, సోంపు గింజ‌లు – ఒక టీ స్పూన్, కొత్తిమీర – అర కట్ట‌, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

వ‌డ కర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో శ‌న‌గ‌పప్పును వేసుకోవాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుని వ‌డ‌లాగా వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌రకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత జార్ లో ప‌చ్చికొబ్బ‌రి తురుము, సోంపు గింజ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత దాల్చిన చెక్క‌, జాజికాయ‌, మ‌రో టీ స్పూన్ సోంపు గింజ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, ప‌సుపు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత నీళ్లు పోసి మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత వీట‌న్నింటిని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాట పేస్ట్ వేసి క‌లపాలి. దీనిని నూనె పైకి వ‌ర‌కు వేయించిన త‌రువాత కొబ్బ‌రి పేస్ట్, పావు లీట‌ర్ నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత వ‌డ‌ల‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. త‌రువాత మూత పెట్టి మ‌ర‌లా నూనె పైకి తేలే వ‌రకు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌, నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వ‌డ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts