Almonds For Diabetes : వయసుతో సంబంధం లేకుండా నేటి తరుణంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిందే. మందులు వాడడంతో పాటు నిత్యం ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే డయాబెటిస్ అదుపులో ఉండదు. దీంతో అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక మందులను వాడుతూ ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది.
అయితే కొందరు డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు ఏది తినాలో ఏది తినకూడదో తెలియక మంచి ఆహారాన్ని కూడా తీసుకోవడం మానేస్తారు. చాలా మంది డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు దూరం పెట్టే మంచి ఆహారాల్లో బాదంపప్పు కూడా ఒకటి. బాదంపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చాలా మంది వీటిని తీసుకోవడమే మానేస్తున్నారు. కానీ డయాబెటిస్ ఉన్న వారు కూడా బాదంపప్పును తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పులో మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
అంతేకాకుండా భోజనం చేసిన తరువాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను 30 శాతం తగ్గేలా చేయడంలో కూడా బాదంపప్పు మనకు సహాయపడుతుంది. అంతేకాకుండా బాదంపప్పును తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బాదంపప్పును తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. శరీరంలో బలంగా తయారవుతుంది. నీరసం రాకుండా ఉంటుంది. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు బాదంపప్పును వంటి మంచి ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. రోజూ 4 బాదంపప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి తీసుకోవాలి. బాదంపప్పు వంటి మంచి ఆహారాన్ని తీసుకుంటూనే షుగర్ వ్యాధి అదుపులో ఉండేలా చూసుకోవడం మంచిది.