Garlic : రక్తాన్ని పలుచగా చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. చాలా కాలం నుండి వంటల తయారీలో వెల్లుల్లిని వాడుతున్నాం. వెల్లుల్లి వంటల రుచిని పెంచడమే కాకుండా మన శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఉపయోగించి అనేక రకాల ఔషధాలను తయారు చేస్తున్నారు. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను వెల్లుల్లిని ఉపయోగించి నయం చేసుకోవచ్చు.
అధిక బరువు తగ్గడంలో, గుండె జబ్బులను నయం చేయడంలో వెల్లుల్లి దివ్య ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లిని ఉపయోగించి తయారు చేసిన అనేక ఔషధాలు మనకు మార్కెట్ లో లభిస్తున్నాయి. వీటిని అధిక ధరలకు కొనుగోలు చేయడం కంటే వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనిని వంటల్లో వాడడం కంటే పచ్చి వెల్లుల్లిని తినడం వల్లే అధిక ప్రయోజనాలను పొందవచ్చు. కానీ వెల్లుల్లి ఘాటైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. పచ్చి వెల్లుల్లిని తినడం కొద్దిగా కష్టమైన పనే అయినప్పటికీ దీనిని పచ్చళ్లతో కలిపి తినవచ్చు.
మన ఇంట్లో టమాట పచ్చడి, మామిడి కాయ పచ్చడి ఇలా ఏదో ఒక పచ్చడి ఉండనే ఉంటుంది. భోజనానికి పది నిమిషాల ముందు మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచి గాలికి ఉంచాలి. ఇప్పుడు ఏదో ఒక పచ్చడిని ఈ వెల్లుల్లి రెబ్బలతో కలిపి భోజనంలో మొదటి ముద్దగా తీసుకోవడం వల్ల పచ్చడి రుచి పెరగడమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వంటల్లో వాడడం వల్ల వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు తగ్గిపోతాయి. కనుక పచ్చి వెల్లుల్లిని ఇలా పచ్చడితో కలిపి తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చని నిపుణలు తెలియజేస్తున్నారు.