సగ్గు బియ్యం అనేది ఒక ప్రాసెస్ చేయబడిన ఆహారం. ఇది శాకాహారమే. దీన్ని హిందువులు వ్రతాలు చేసే సమయంలో ఎక్కువగా వాడుతారు. సాగొ లేదా సగ్గుబియ్యం లేదా సాబుదాన అని దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. కర్ర పెండలం పొడి నుంచి దీన్ని తయారు చేస్తారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* సగ్గు బియ్యం శరీరాన్ని చల్లబరచడంలో అమోఘంగా పనిచేస్తుంది. వేడి శరీరం ఉన్నవారు దీన్ని రోజూ తీసుకుంటే మంచిది. సగ్గు బియ్యాన్ని పాలు లేదా నీటిలో ఉడకబెట్టాలి. తరువాత అందులో కొద్దిగా చక్కెర వేసి తినాలి. దీంతో వేడి తగ్గుతుంది. శరీరం చల్లబడుతుంది. దీన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలన్నీ తగ్గుతాయి. ముఖ్యంగా మలబద్దకం, విరేచనాలు తగ్గుతాయి. మోషన్స్ అయ్యేవారికి ఇది మంచి ఆహారం. త్వరగా విరేచనాలు కట్టుకుంటాయి. ఇక దీన్ని చిన్నారులకు కూడా తినిపించవచ్చు.
* జీర్ణాశయంలో అల్సర్లు ఉన్నవారు, పేగులు వాపులకు గురైన వారు సగ్గు బియ్యాన్నితింటే మంచిది.
* సగ్గుబియ్యంలో ప్రోటీన్లు, విటమిన్ సి, కాల్షియం, మినరల్స్ ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటాం.
* రోజూ నీరసంగా, అలటగా ఉన్నవారు సగ్గుబియ్యాన్ని తింటే తక్షణమే శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేయగలుగుతారు.
* జ్వరం లేదా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చి కోలుకుంటున్న వారు సగ్గు బియ్యాన్ని తినడం వల్ల శక్తి లభించి త్వరగా కోలుకుంటారు.
* హైబీపీ సమస్య ఉన్నవారు రోజూ సగ్గు బియ్యాన్ని తినడం వల్ల బీపీ తగ్గుతుంది.
* సగ్గు బియ్యంలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల ఎముకలు విరిగిన వారు సగ్గు బియ్యాన్ని రోజూ తింటే మంచిది. ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
సూచన: సగ్గు బియ్యం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగినప్పటికీ ఇందులో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి కనక డయాబెటిస్ ఉన్నవారు తీసుకోరాదు. అలాగే అధిక బరువు ఉన్నవారు సగ్గు బియ్యాన్ని వాడరాదు.