ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అని ఆంగ్లంలో సామెత ఉంది. రోగాన్ని నయం చేసుకునేందుకు తగిన మందులు వాడేకన్నాకూడా ఆ రోగంబారినపడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదంటున్నారు వైద్యులు. ప్రస్తుతం సమాజంలో చాలామంది గుండె వ్యాధిబారినపడినవారు ఎక్కువగా ఉన్నారని సర్వేలు చెపుతున్నాయి. మనిషి శరీరంలో ప్రధానమైన భాగం గుండె. ఆ గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే సరి. గుండె ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు.
యమానుసారం మీకు నచ్చిన వ్యాయామం చేయండి. మీ శరీర బరువును ఎల్లపుడూ నియంత్రణలో ఉంచుకోండి. శారీరక, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. కంటినిండా నిద్రపొండి. (కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలంటున్నారు వైద్యులు.) స్మోకింగ్ నిలపండి. పొగాకు నమలడం, పొగాకు సంబంధిత వస్తువులను వాడకండి. లిక్కర్లు, ఆల్కహాల్ మొదలైన మత్తు పానీయాలు సేవించకండి. మీరు తీసుకునే ఆహారంలో కొవ్వుశాతం అతి తక్కువగా ఉండేలా చూసుకోండి. మీ ఆహారంలో సలాడ్, పండ్లు, ఇతర పీచు పదార్ధాలు అధికంగా తీసుకోండి.
మీరు నలభై సంవత్సరాల వయసు దాటినవారైతే నియమానుసారం వైద్య పరీక్షలు చేయించుకోండి. వైద్యుల సలహామేరకు మీ జీవిత శైలిని, ఆహారపుటలవాట్లను మార్చుకోండి. నియమానుసారం మీ శరీరంలోని రక్తాన్ని పరీక్షించుకోవాలి. రక్తంలో చక్కెర, కొవ్వుశాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటుండాలి. ఏదైనా తేడాలుంటే వెంటనే వైద్యుని సలహాలను పాటించాలి. అదే మీ వయసు 45 సంవత్సరాలు దాటితే సంవత్సరానికి ఒకసారి మీ గుండెను ఇ.సి.జి, ట్రెడ్ మిల్, 2 డి ఎకో, మున్నగు వాటిద్వారా పరీక్షించుకోండి. ఇది తప్పనిసరి అంటున్నారు వైద్యులు. ఈ నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తే గుండె జబ్బులు మీకు చాలా దూరంలో వుంటాయి.