గుండెజబ్బుతో బాధపడేవారు గుండెపోటు బారిన పడకూడదనుకుంటే ప్రతి రోజూ చేపల కూర సేవిస్తుండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజూ చేపల ఆహారం తీసుకుంటూ వుంటే, మనిషి శరీరంలోని గుండె సవ్యంగా పని చేస్తుందని, దీంతో గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తమ పరిశోధనల్లో తేలినట్లు యూనివర్శిటీ ఆఫ్ ఎథేంస్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు.
వారానికి రెండు లేక మూడు రోజులపాటు చేపల ఆహారం తీసుకుంటే, గుండె జబ్బు రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్. డీ. పనాజియోటాకో తెలిపారు. ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
ప్రత్యేకంగా ఏ రకానికి చెందిన చేపలు తింటే మరింత ఆరోగ్యంగా ఉంటారనేది తాము అధ్యయనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ప్రస్తుతం నిర్వహించిన పరిశోధనలననుసరించి చేపలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటూ గుండె జబ్బులబారిన పడకుండా ఉంటారని ఆయన తెలిపారు.