Towel : టవల్స్ వాడని వారు, టవల్ లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరు ఒంటిని శుభ్రపర్చుకోవడానికి టవల్ ని వాడతారు. కొంతమంది ఏళ్ల తరబడి ఒకే టవల్ వాడుతూ గొప్పగా చెప్పుకుంటారు. ఇన్నేళ్లయినా చిరగలేదు అని. ఇంకొంతమంది చినిగిపోయినా అదే టవల్ ను వాడతారు. కానీ టవల్ ని క్లీన్ చేస్తున్నామా లేదా అని ఆలోచించరు. నూటికి 90 శాతం మంది టవల్ ను శుభ్రంగా ఉంచుకోరు. రోజువారీ మన లైఫ్ లో భాగమైన టవల్ గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేమిటంటే..
చాలామంది వారు వాడే టవల్ లను ఒక దగ్గరే ఆరేయడం, ఒక దగ్గరే మేకుకు వేలాడదీయడం చేస్తుంటారు. ఇలా చేస్తున్నారంటే మీరు బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తున్నట్టే. ప్రతి ఒక్కరి టవల్ ను వేరు వేరుగా ఆరబెట్టాలి. టవలే కదా ఎప్పుడో ఒకసారి ఉతుక్కోవచ్చులే అనుకుంటే.. మీరే మీ రోగాల్ని ఆహ్వానించినవారవుతారు. వారానికి రెండు సార్లయినా టవల్ ను ఉతుక్కోవాలి. టవల్ చిరగలేదని బాగానే ఉంది అని ఏళ్ల తరబడి ఒకటే వాడుతుంటారు. అలాకాకుండా టవల్ ను ఏడాదికోసారైనా మారుస్తూ ఉండాలి. ఉతకకుండా వాడే టవల్స్ వల్ల బ్యాక్టీరియా, ఫంగస్, మలమూత్ర రేణువులు, మృత చర్మ కణాలకు అనేక రకాల కణాలకు నిలయాలుగా ఉంటాయి. కనుక టవల్స్‌ను తరచూ శుభ్రం చేయాలి.
ఒక టవల్ ను ఒకరికి మించి వాడడం మంచిది కాదు. దానివల్ల అనారోగ్యం ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకరికి మించి వాడాలనే ఆలోచనే సరికాదు. ఎవరి టవల్‌ను వారే వాడాలి. టవల్స్ ను ఉతకడానికి ఎక్కువ డిటర్జెంట్ వాడకూడదు. దానివల్ల టవల్ గట్టిగా తయారయి వాడుకోవడానికి అసౌకర్యంగా ఉంటుంది. అంతే కాకుండా టవల్ ను ఉతకడానికి వేడినీరు ఉపయోగించడం మంచిది. ఇలా సూచనలు పాటిస్తే టవల్ శుభ్రంగా ఉంటుంది. దీంతో ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి.