తమలపాకులను మనం రకరకాలుగా వినియోగిస్తుంటాం. పూజలు, శుభకార్యాలు, కిల్లీ వంటి సందర్భంలో విరివిగా ఉపయోగిస్తుంటాం. ఇది మనకు పూర్వీకుల నుంచి వచ్చిన అలవాటు. ఏ శుభకార్యమూ తమలపాకు లేకుండా జరగదంటే అతిశయోక్తి కాదు. చాలా మంది భోజనం తర్వాత కిల్లీ(తాంబూలం) తినే అలవాటు ఉంటుంది. ఇంకొందరు సాధారణంగా రోజూ ఆకు, వక్క, సున్నంతో కిల్లీ వేసుకుంటారు. తమలపాకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిని రోజూ తినే వారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. తమలపాకుల్లో మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, కాల్షియం, విటమిన్-సి సహా అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను మనం రోజూ తినడం ద్వారా ఇందులో ఉండే ఔషధ గుణాలు జలుబు, దగ్గు, ఆస్తమా, జీర్ణక్రియ వంటి అనేక రకాల సాధారణ అనారోగ్యాలతోపాటు ఇతర రోగాలు దరి చేయకుండా చేస్తాయి.
చాలా మంది భోజనం తర్వాత కిల్లీ(తాంబూలం) వేసుకునే అలవాటు ఉంది. ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచి భోజనం త్వరగా జీర్ణం అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారికి తలమపాకు దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇందులో ఉండే మంచి గుణాలు ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు చెక్ పెడతాయి.
డయాబెటిస్ కంట్రోల్ చేసేందుకు తమలపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడం వల్ల డయాబెటిస్ రోగులకు ప్రయోజనం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడేవారు తప్పకుండా రోజుకు ఒకటి నుంచి రెండు ఆకులు క్రమం తప్పకుండా తినడం మంచిది. భోజనం తర్వాత అరగంటకు నాలుగైదు తమలపాకులను జ్యూస్ చేసుకుని తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వీటితో చేసిన రసం తాగినా లేదా యాలకులు, దాల్చినచెక్క వేసి సిరప్ తయారు చేసుకుని తాగినా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
మూత్ర సంబంధిత సమస్యలు నివారించేందుకు తమలపాకులు సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు. దీనికి ప్రతిరోజూ ఓ టీ స్పూన్ తమలపాకు రసం తాగడం వల్ల అది శరీరం నీటిని నిలుకునే సామర్థ్యాని పెంచుతుంది. దీని ద్వారా మూత్ర సమస్యలు తొలగిపోతాయి. మనం కిల్లీ తినే సందర్భంలో లాలాజలం బాగా స్రవిస్తాము. దాన్ని మింగడం ద్వారా అది జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే తమలపాకుల వల్ల జీర్ణాశయంలో ఆమ్లత తగ్గుతుంది. తద్వారా కడుపుబ్బరం తగ్గే అవకాశం ఉంది. తమలపాకులు ఆకలిని పెంచి మలబద్ధకాన్ని నివారిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఇవే కాకుండా చాతిలో నొప్పి, గుండెలో మంట వచ్చినప్పుడు ఓ టీస్పూన్ తమలపాకు రసం తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. గొంతు, నోటి సమస్యలు దూరం చేయెుచ్చు. తమలపాకులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. అలాగే తమలపాకులు బ్రోన్కైటిస్‌ని తగ్గించగలవు. ఎందుకంటే వీటిల్లో యాంటీహిస్టామైన్ లక్షణాలు మెండుగా ఉంటాయి.