చిరుతిండ్లు తినటమంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, ఇతర బేకరీ ఆహారాలు, బాగా నూనెలో వేయించిన వేపుడులు బజ్జీలు, పునుగులు వంటివాటిని ఎంతో ఇష్టంగా కంటికి కనపడినపుడల్లా తినేస్తారు. వాటికితోడు రెడీగా లభ్యమయ్యే కూల్ డ్రింకులు కూడా తాగేస్తారు. వాటిని చూస్తే చాలు నియంత్రణ కష్టమైపోతుంది. అయితే, కొత్తగా కొంతమంది యువతీ యువకులు చాలావరకు ఉద్యోగస్తులు, కాలేజీ విద్యార్ధులు ఈ రకమైన శరీరంలో కొవ్వును పెంచి లావుగా తయారు చేసే బేకరీ ఆహారాలు, నూనె ఆహారాలకు స్వస్తి చెప్పి, వాటి స్ధానంలో పండ్లు, ఇతర ఆరోగ్యకర పానీయాలైన పండ్లరసాలు, చెరుకురసం, మొదలైనవాటికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇది స్వాగతించదగిన పరిణామమే.
ఎవరైనప్పటికి ఎప్పటికపుడు బరువు నియంత్రణ, శారీరక పరిశీలన చేసుకుంటూ పోతే వారి శారీరక అస్తవ్యస్తం వారికే అర్ధమవుతుంది. ఏది కనపడితే దానినల్లా తింటూ వుంటే, కొవ్వు పెరిగి శారీరక రూప లావణ్యాలు వెనుకపడతాయనటాన్ని నేటి యువతలో కొంతమంది గ్రహిస్తున్నారు. స్నాక్స్ సమయం అయిందా? ఆ సమయానికి కొన్ని పండ్లు తినటానికి సిద్ధం చేసిపెట్టుకోండి. లేదా బాదంపప్పు, కిస్ మిస్, జీడిపప్పు, ఆక్రోట్ వంటి ఎండుఫలాలు మీ దగ్గరే వుంచుకోండి. ఇక మీరు ఇతర అనారోగ్య ఆహారాలు తినాలన్న ధ్యాస వుండదు.
రోజంతా మిమ్మల్ని అవి తాజాగా కూడా వుంచుతాయి. కూల్ డ్రింక్ కు బదులుగా, చెరకు రసం లేదా పండ్ల రసంవంటివి తాగి ఆనందించండి. అయితే ఈ పండ్ల రసాలలో అనారోగ్యం కలిగించే ఐస్ లేదా షుగర్ వంటివి వేయకుండా చూసుకోండి. అయితే, ఇప్పటికే ఒక మోస్తరు లావుగా వుండేవారు అధిక కేలరీలు కల పండ్లు అంటే అరటిపండు, మామిడి పండు వంటివి తగ్గించి తినటం మంచిది. మీరు ఎక్కడ వున్నప్పటికి, కొద్దిపాటి అన్వేషణలో ఆరోగ్యకరమైన సహజ ఆహారాలు పొంది వాటిని ఆనందించవచ్చు.